Published on Dec 21, 2024 4:05 PM IST
ఇటీవల ‘పుష్ప-2’ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటనపై పోలీసులు తమ విచారణలో భాగంగా అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపగా, హైకోర్టు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే, ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనపై చర్చించారు. సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం స్పెషల్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేలా అనుమతులు జారీ చేసిందని ఆయన తెలిపారు. అయితే, ఓ వ్యక్తి మృతి కారణంగా ఇకపై సినిమాలకు ఎలాంటి స్పెషల్ ప్రివిలేజ్‌లు ఉండవని.. తాను సీఎంగా ఉన్నంతవరకు ఎలాంటి ప్రత్యేక పర్మిషన్‌లు ఉండబోవని సీఎం అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు.
ఓ సాధారణ మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు ఆసుపత్రిలో కోమాలో ఉండగా.. ఒక్క సినిమా ప్రముఖులు కూడా అతడిని చూసేందుకు వెళ్లలేదని.. కానీ ఓ హీరో జైలుకు వెళ్లి బెయిల్ పై రాగానే సినిమా పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు అతని ఇంటికి క్యూ కట్టారు అంటూ రేవంత్ విమర్శలు చేశారు. ఇలా తెలంగాణ సీఎం సంధ్య థియేటర్ ఘటనపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.