
ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా కోట్లలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాల ప్రభావంతో హీరోయిన్స్ పారితోషికం కూడా భారీగా పెరిగింది. అయితే అందరి హీరోయిన్లు ఒకే స్థాయిలో ఉండడం లేదు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందుకుంటుండగా మరికొందరు తక్కువ పారితోషికంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఒక ప్రముఖ నటి సినిమా బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ తనకు ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ నటి మరెవరో కాదు బాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న నోరా ఫతేహి. తెలుగులో కూడా ఆమె మంచి క్రేజ్ సంపాదించింది. ఎన్టీఆర్ టెంపర్ సినిమాలో అలాగే ప్రభాస్ బాహుబలి సినిమాలో స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. ఆమె స్టేజ్ షోస్ లోనూ అత్యద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నోరా ఫతేహి తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించింది. తాను నటించిన కొన్ని స్పెషల్ సాంగ్స్ సినిమాలకు బ్లాక్‌బస్టర్ హిట్ తీసుకువచ్చాయని అయితే నిర్మాతలు తాను చేసిన కష్టానికి రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించింది. ఆమె డబ్బు కోసం పోరాటం చేయలేదని కానీ కేవలం పేరు మాత్రమే వస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది.
ఇకపై ఏ లాభం లేకుండా పని చేయకూడదని నిర్ణయించుకున్న నోరా తన కెరీర్‌లో మరింత జాగ్రత్తగా ముందుకు సాగాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో బిజీగా ఉండగా టాలీవుడ్‌లోనూ మరిన్ని అవకాశాలు కోసం ఎదురుచూస్తోంది.