
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను నా ప్రాంతీయ ప్రేక్షకులకు వడ్డించే దమ్ మసాలా బిర్యానీ ఇదే… కానీ నా తదుపరి కెరీర్ డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే చెప్పలేను” అంటూ ముందుగా క్లారిటీ ఇచ్చారు. అయితే, మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతుండటం అభిమానులకు కొంత ఆందోళన కలిగిస్తోంది. “మీ స్టైల్ సినిమాలు చేస్తూనే, మరోవైపు మన ప్రాంతీయ ప్రేక్షకులను టార్గెట్ చేయండి” అని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇటీవల అల్లు అర్జున్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ఎప్పటికైనా మంచి మ్యూజిక్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ చేయాలనుకుంటున్నాను” అని తెలిపారు. కానీ, పుష్పరాజ్ ఇమేజ్ పెరిగిన ఈ సమయంలో క్యూట్ లవ్ స్టోరీ తీసే అవకాశం ఉందా? అని ఫ్యాన్స్ సందేహిస్తున్నారు. అయితే, “మీరు మనసు పెడితే అన్నీ అవే అవుతాయి” అని ఆయన అభిమానులు అంటున్నారు. ప్రభాస్ విషయంలో కూడా ఇదే పరిస్థితి. అధిక బడ్జెట్, గ్రాండ్ విజువల్స్ కలిగిన సినిమాలపై దృష్టి పెట్టడం బాగానే ఉన్నా, కొన్నిసార్లు స్థానికంగా కనెక్ట్ అయ్యే కథల్ని మిస్ అవుతున్నారని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
అందుకే, ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ఉండాలని అనుకోవద్దని అభిమానులు హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకటి రెండు భారీ సినిమాలు చేసినా, మధ్య మధ్యలో గ్రౌండ్ లెవల్ స్టోరీలతో ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని సూచిస్తున్నారు. ఉదాహరణకు, రీసెంట్ బ్లాక్ బస్టర్ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా స్థానికంగా కనెక్ట్ అయ్యేలా తీసినప్పటికీ, భారీ విజయాన్ని సాధించింది.
సమకాలీన పరిస్థితుల్లో పాన్ ఇండియా సినిమాల విజయ రేటు ఎంతైనా ఉండొచ్చు. కానీ, రీజనల్ ఆడియన్స్కు టార్గెట్ చేసిన సినిమాలు నష్టాలను తగ్గిస్తాయి, పైగా స్క్రిప్ట్ బలంగా ఉంటే ఇతర భాషల్లో స్వయంగా అనువాదం చేసుకుంటారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా పని చేయాలంటే, కొంచెం ప్రాంతీయంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.