Published on Nov 24, 2024 6:00 AM IST
ప్రముఖ మీడియా సంస్థ టీవీ9కు చెందిన న్యూస్9 జర్మనీలోని స్టుట్‌గాట్ నగరంలో గ్లోబల్ సమ్మిట్ 2024కు శ్రీకారం చుట్టింది. భారత్- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య, ద్వైపాక్షిక, సాంస్కృతిక, క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతోంది. నవంబర్ 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ గ్లోబల్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ సమ్మిట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు జర్మనీకి చెందిన మంత్రులు, ప్రతినిధులు, ఇరు దేశాలకు చెందిన ప్రముఖులు దాదాపు 200 మంది పాల్గొన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. ఇండో-జర్మన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైందన్నారు. టీవీ9 ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందనలు తెలిపారు. జర్మనీ గురించి తెలుసుకునేందుకు ఇది ఒక కొత్త అవకాశమన్నారు. భారత్‌కు ముఖ్యమైన భాగస్వాముల్లో జర్మనీ ఒకటని.. రానున్న కాలంలో భారత్, జర్మనీల మధ్య వాణిజ్యం మరింత పెరుగుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
మై హోం గ్రూప్ వైస్ చైర్మన్ రాము జూపల్లి న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ.. భారతదేశానికి యువ శక్తి గొప్ప సంపద. సరికొత్త ఆవిష్కరణలతో ఎన్నో అంకుర సంస్థలు భారతదేశంలో విజయవంతంగా ఎదిగి, అభివృద్ధి సాధించాయి. కొత్త ఆవిష్కరణలతో వచ్చే సంస్థలకు భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయి, ప్రపంచం నలువైపుల నుంచి భారత్‌లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు.
టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ.. ఆయనకంటూ ఓ ప్రత్యేకను గుర్తింపును సంపాదించుకుని ప్రపంచ నేతగా ఎదిగారని పేర్కొన్నారు. RRR అంటే రిలేషన్ షిప్, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ప్రధాని మోదీ వ్యక్తిత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.