Published on Dec 17, 2024 11:04 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళ్తోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ఫీస్ట్ మూవీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. అయితే, ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట గురించి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందడంతో విషాదం నెలకొంది.
అయితే, ఇప్పుడు ఈ ఘటనతో సంధ్య థియేటర్ యాజమాన్యానికి కొత్త చిక్కులు వచ్చి చేరాయి. ఇటీవల ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చాడు. అయితే, తొక్కిసలాట ఘటనలో గాయపడిన మృతురాలి తనయుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు పంపారు. రెండు థియేటర్లకు ఒకే ఎంట్రీ, ఒకే ఎగ్జిట్ ఉండటం.. ‘పుష్ప-2’ ప్రీమియర్‌లో ఓ మహిళ మృతికి కారణం అయిన ఈ థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.