Pottel Movie Review in Telugu, Ananya Nagalla, Ajay

విడుదల తేదీ : అక్టోబర్ 25, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల , అజయ్, నోయల్, తనస్వీ చౌదరి,శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్, ప్రియాంక శర్మ, తదితరులు

దర్శకుడు : సాహిత్ మోత్కూరి

నిర్మాతలు : సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితి,

సంగీత దర్శకుడు : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫీ : మోనిశ్ భూపతి రాజు

ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్

సంబంధిత లింక్స్: ట్రైలర్

సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో యువ చంద్ర కృష్ణ హీరోగా అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటించిన మూవీ పొట్టేల్. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఈ పొట్టేల్ కథ 1970, 80వ దశకంలో సాగుతుంది. మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్ ప్రాంతంలోని ఓ ఊర్లో ఈ కథ నడుస్తుంది. ఆ ఊరి గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి ఓ సారి జాతర చేసి పొట్టేల్‌ను బలి ఇవ్వాలనేది ఆ ఊరి కట్టుబాటు, ఆచారం. అలాగే, ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని అక్కడి జనం గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. అయితే, ఆ ఊరి పటేల్ (అజయ్)కి మాత్రం చిన్న తనం నుంచి బాలమ్మ పూనదు. ఈ నేపథ్యంలో బాలమ్మ పూనకం ముసుగులో పటేల్ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. మరోవైపు, పెద్ద గంగాదరీ( యువ చంద్ర) తనకి ఇష్టం లేకుండానే చిన్నతనం నుంచే వారసత్వపు వృత్తిగా వచ్చిన గొర్రెలని మేపుతూ లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. అందులో భాగంగానే ‘బాలమ్మ’ అమ్మవారి అనుగ్రహంగా ఊరి వాళ్ళు భావించే ‘పొట్టెల్’ని పెద్ద గంగాదరీ పెంచుతుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో పటేల్‌కు వ్యతిరేకంగా పెద్ద గంగాదరీ తన కూతురు సరస్వతిని టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్) సాయంతో ఎలా చదివించాడు ?, అసలు పెద్ద గంగాదరీకి చదువు పై ఎందుకు అంత మమకారం ?, తనకు చదువు లేకపోవడం వల్ల పెద్ద గంగాదరీ జీవితంలో ఏం కోల్పోయాడు ?, ఇంతకీ పెద్ద గంగాదరీ చదువు విషయంలో ఏం సాధించాడు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఒకప్పుడు తెలంగాణలోని పటేల్‌ వ్యవస్థ వల్ల బడుగుబలహీన వర్గాలు, దళిత ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారు ?, అప్పట్లో బానిసలుగా ఎంతగా నలిగిపోయేవారో.. ముఖ్యంగా చదువు విషయంలో దళిత వర్గాల పిల్లలు ఎంత అన్యాయానికి గురి అయ్యారో ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. అదేవిధంగా కూతురిని చదివించడం కోసం ఓ తండ్రి పడే తపన, ఆవేదన సినిమాలో ఆకట్టుకుంది. నలభై, యాభై ఏళ్ల క్రితం నాటి కథా నేపథ్యం కాబట్టి, అప్పటి పరిస్థితులకు తగ్గట్టు పాత్రల చిత్రీకరణతో పాటు సెటప్ ను కూడా బాగా డిజైన్ చేశారు. ఈ క్రమంలో పటేల్ కి, హీరోకి మధ్య జరిగే డ్రామా కూడా బాగుంది.

ఇక చిన్నారి సెంటిమెంట్‌, బాలమ్మ (అమ్మోరు) ఎలిమెంట్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. నటీనటుల విషయానికి వస్తే.. యువ చంద్ర పాత్ర బాగుంది. తన పాత్రలో యువ చంద్ర కూడా చాలా చక్కగా నటించాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య నాగళ్ల కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన అజయ్ చాలా బాగా నటించాడు. సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అలాగే, ఛత్రపతి శేఖర్, తనస్వి చౌదరి,ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఎమోషన్స్ ని ఎఫెక్టివ్ గా హ్యాండిల్ చేసిన డైరెక్టర్, కొన్ని కీలక సన్నివేశాలను మాత్రం చాలా స్లోగా సాగదీశాడు. నిజానికి కథా నేపథ్యం తాలూకు సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ముఖ్యంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే సీన్స్ ను ఇంకా బాగా ఆసక్తికరంగా మలిచి ఉండాల్సింది.

అలాగే, తెలంగాణలోని పటేల్‌ వ్యవస్థ కాలం నాటి ఎలిమెంట్స్ ఇప్పటి తరానికి అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. ఐతే, ఆ వ్యవస్థ ఎలా ఉండేదనేది ఈ జనరేషన్‌కి చెప్పే ప్రయత్నాన్ని మాత్రం అభినందించాలి. కాకపోతే, ఆ ప్రయత్నం ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటే సినిమాకి మేలు జరిగేది. అదే విధంగా హీరో పాత్రను ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు సాహిత్ మోత్కూరి, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ ను రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల తడబడ్డాడు. కానీ, ఆయన రూపొందించిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు నిర్మాతలను అభినందించాలి. నిర్మాతలు ‘సురేశ్ కుమార్ సడిగే, నిశాంక్ రెడ్డి కుడితి’ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘పొట్టేల్’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ పీరియాడిక్ డ్రామా.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా కథా నేపథ్యం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. అయితే, స్క్రీన్ ప్లే స్లోగా సాగడం, కొన్ని సీన్స్ ఆసక్తికరంగా లేకపోవడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *