
తెలుగు చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న ప్రగ్య జైస్వాల్ 12 జనవరి 1988న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్లో జన్మించింది. ఆమెకు ప్రంజూల్ జైస్వాల్ అనే సోదరి ఉంది. పూణేలోని Symbiosis Law School లో చదివిన ప్రగ్య, విద్యా దశలోనే మోడలింగ్ పట్ల ఆసక్తి కనబరిచింది. Femina Miss India 2008 పోటీలో పాల్గొని Miss Fresh Face, Miss Dancing Queen, Miss Friend Earth టైటిల్స్ గెలుచుకుంది. 2014లో కళా, సాంస్కృతిక రంగంలో తన ప్రతిభతో Sahjeevan Cultural Award అందుకుంది.
2015లో ‘మిర్చి లాంటి కుర్రాడు’ సినిమాతో టాలీవుడ్లో అడుగు పెట్టిన ప్రగ్య, అదే ఏడాది వచ్చిన ‘కంచె’ సినిమా ద్వారా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ సినిమాకు Filmfare Best Female Debut, SIIMA Best Debut (Telugu), CineMAA Awards Best Female Debut, TSR-TV9 Best Debut Actress అవార్డులు లభించాయి. ‘కంచె’తో నటనకు మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్య ఆ తర్వాత ‘ఓం నమో వెంకటేశాయ’ అనే ఆధ్యాత్మిక చిత్రంలో నటించి మెప్పించింది.
ప్రగ్య జైస్వాల్ కెరీర్లో ‘జయ జానకి నాయక, అఖండ’ సినిమాలు పెద్ద విజయాలను సాధించాయి. ‘అఖండ’లో బాలకృష్ణ సరసన నటించి భారీ విజయాన్ని అందుకుంది. అయితే ‘గుంటూరోడు, నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర, సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయాయి. ఈ మధ్యనే ఆమె ‘డాకు మహారాజ్’ చిత్రంలో నటించింది.
ప్రస్తుతం ప్రగ్య జైస్వాల్ ‘అఖండ 2’ లో కథానాయికగా నటిస్తోంది. ఆమె అందం, అభినయం ప్రేక్షకులను అలరించడంతో పాటు, సోషల్ మీడియాలోనూ ఎంతో క్రేజ్ ఉంది. త్వరలో మరిన్ని ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.