
సుహాస్ హీరోగా నటించిన “కలర్ ఫోటో” 2020లో విడుదలై భారీ విజయం సాధించింది. సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. 1990ల మచిలీపట్నం నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. సుహాస్, చాందినీ చౌదరి, సునీల్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో నటించగా, సునీల్ నెగటివ్ రోల్ లో అదరగొట్టాడు.
అయితే, ఈ సూపర్ హిట్ మూవీ లో నటించే అవకాశం వచ్చినా, దానిని మిస్ చేసుకున్నందుకు హీరోయిన్ ప్రియా వడ్లమాని ఎంతో అఫ్సోస్ ఫీలవుతోంది. 2018లో “ప్రేమకు రెయిన్ చెక్” ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ప్రియా, “హుషారు” సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, “కలర్ ఫోటో” తన కెరీర్‌ను ఇంకో లెవెల్‌కి తీసుకెళ్లేదని ఆమె చెబుతోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రియా మాట్లాడుతూ, “ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసి ‘కలర్ ఫోటో’ టీమ్ నన్ను సంప్రదించింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ సినిమా చేయలేకపోయాను” అని చెప్పింది. సినిమా బ్యాగ్రౌండ్ లేకపోవడం, సరైన గైడెన్స్ లేకపోవడం, పైగా పల్లెటూరి అమ్మాయి పాత్రకు తాను సరిపోను అనే భావనతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వివరించింది.
ప్రస్తుతం ప్రియా వడ్లమాని టాలీవుడ్‌లో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. “కలర్ ఫోటో” మిస్ అయినా, భవిష్యత్తులో అలాంటి ఎమోషనల్ లవ్ స్టోరీ చేసే అవకాశం రావాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది.