
టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ కమెడియన్ రఘుబాబు సినీ పరిశ్రమలో 400కి పైగా చిత్రాల్లో నటించి, తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ విలన్‌గా తనదైన శైలిలో రఘుబాబు ఎంతో మంది అభిమానాన్ని గెలుచుకున్నారు. ప్రముఖ నటుడు గిరిబాబు తనయుడిగా సినీరంగంలో ప్రవేశించిన ఆయన, ఇప్పుడు తన తనయుడు గౌతమ్ రాజా ను కూడా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘుబాబు, గౌతమ్ రాజా కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రహ్మ ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రఘుబాబు తన సినీ ప్రయాణం గురించి భావోద్వేగంగా స్పందించారు.
రఘుబాబు మాట్లాడుతూ, ‘బన్నీ’ సినిమా సక్సెస్ మీట్ లో తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘అప్పుడు స్టేజ్ మీద అందరూ సినిమా టీమ్‌ని ప్రశంసించారు, కానీ నా పేరు ఎవరు తీసుకోలేదు. స్టార్ డైరెక్టర్ వినాయక్ సైతం ఆశ్చర్యపోతూ, నువ్వు సినిమాలో అంత బాగా నటించీ ఎవరు నీ పేరు ఎందుకు అనలేదు?’’ అని అడిగారని చెప్పారు. అయితే, ఆ వేళ మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ మీద నా పేరు స్పెషల్‌గా తీసి, నన్ను అభినందించడం జీవితాంతం మర్చిపోలేని విషయం’’ అంటూ ఎమోషనల్ అయ్యారు.
రఘుబాబు తన సినీ ప్రస్థానానికి చిరంజీవి పొగడ్తలే కీలకమయ్యాయని తెలిపారు. ‘‘ఆయన మాటలు నా కెరీర్‌లో మలుపు తిప్పాయి. చిరంజీవి గారి ప్రశంసే నన్ను 400కి పైగా సినిమాల్లో నటించే స్థాయికి తీసుకొచ్చింది. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను’’ అంటూ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం రఘుబాబు తెలుగు ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు. అభిమానులను నవ్విస్తూ, తనదైన నటనతో మెప్పిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అమోఘమైన ముద్ర వేశారు.