
90వ దశకంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగొందిన రంభ తిరిగి వెండితెరకు రాబోతోంది. 15 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రంభ, సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే, కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ కోసం సిద్ధమవుతోంది.
రంభ తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి టాప్ హీరోలతో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన కొన్ని హిట్ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆమె ఐకానిక్ సాంగ్స్‌లో అళగియ లైలా పాట ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. అంతేకాదు, ఆమె 100కి పైగా సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది.
2010లో కెనడియన్ బిజినెస్‌మెన్ ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. ప్రస్తుతం, ఆమె రూ.2000 కోట్లకు పైగా ఆస్తుల మాలిక అని చెబుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నా, రంభ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి తన ఫ్యామిలీ విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది.
ఇప్పుడు రంభ బుల్లితెరలో రియాల్టీ షోల జడ్జిగా వ్యవహరిస్తూ, సినీ ఇండస్ట్రీలో మళ్లీ తన స్థానం నిలబెట్టుకునే ప్రయత్నాల్లో ఉంది. రంభ రీఎంట్రీ పై ఫ్యాన్స్ భారీ ఎత్తున ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఆమె కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ రానుందనే టాక్ వినిపిస్తోంది.