
నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తిరుగుతోంది. సీబీఐ, డీఆర్‌ఐ అధికారులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకురావడంలో భారీ నెట్‌వర్క్ ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో దాడులు కొనసాగుతుండగా, అక్కడి సిబ్బంది, ట్రావెల్ ఏజెన్సీలను అధికారులు విచారిస్తున్నారు.
ఈ కేసులో అనేక అనుమానితులను డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మార్చి 2న ఢిల్లీలో, మార్చి 3న బెంగళూరులో, ఆ తర్వాత ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం అక్రమ రవాణా కేసులు బయటపడ్డాయి. ఈ మూడు చోట్ల కలిపి కిలోగ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
నటి రన్యా రావు నిర్వహించే కంపెనీ జిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురించి కూడా దర్యాప్తు జరుగుతోంది. తుమకూరు జిల్లాలోని షిరా సమీపంలో 12 ఎకరాల భూమి ఈ కంపెనీకి కేటాయించబడింది. 2023లో బీజేపీ ప్రభుత్వం హయాంలో ఈ భూమిని కంపెనీ కొనుగోలు చేసింది. దీనిపై తాజాగా రాజకీయ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు రన్యా రావు బిజినెస్ లింకులు, ఢిల్లీతో సంబంధాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆమె గతంలో సందర్శించిన బంగారు దుకాణాలు, వ్యాపార భాగస్వాములు అందరికీ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ కేసు మరింత లోతుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.