
కోలీవుడ్ స్టార్ కమెడియన్ రెడిన్ కింగ్స్‌లే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. బీస్ట్, జైలర్, మార్క్ ఆంటోని, కంగువా వంటి హిట్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, గత ఏడాది కిరణ్ అబ్బవరం సినిమా ద్వారా టాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు. తన వినూత్నమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, తెలుగులో కూడా అభిమానులను సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం రెడిన్ కింగ్స్‌లే కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే వ్యక్తిగత జీవితంలో కూడా ఓ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు. 2023లో ప్రముఖ బుల్లితెర నటి సంగీతను ప్రేమ వివాహం చేసుకున్న ఆయన త్వరలో తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ఈ వార్త తెలిసిన తర్వాత రెడిన్ అభిమానులు, సహా నటులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 45 ప్లస్ వయసులో పెళ్లి చేసుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైనా, ఈ జంట ఆనందంగా జీవనం కొనసాగిస్తున్నారు.
ఇటీవల సంగీత సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా నటుడు ఆది పినిశెట్టి భార్య నిక్కీ గల్రాణీ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
ప్రస్తుతం రెడిన్ తన చేతిలో ఉన్న ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే, తన కొత్త జీవితానుభూతిని ఆస్వాదిస్తున్నాడు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులుగా మారబోతుండటంతో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.