
సమీప కాలంలో మలయాళ చిత్ర పరిశ్రమలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్, హారర్ డ్రామాల నేపథ్యంలో రూపొందిన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది థియేటర్లలో విడుదలై సెన్సేషనల్ హిట్ అయిన చిత్రం “రేఖాచిత్రం”. ప్రముఖ నటుడు ఆసిఫ్ అలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 9న థియేటర్లలో విడుదలై, అద్భుతమైన విజయాన్ని సాధించింది. కేవలం రూ. 9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీ(OTT)లో ప్రసారం కానుంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Sony LIV మార్చి 7 నుండి “రేఖాచిత్రం” సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ థ్రిల్లర్‌ను వీక్షించే అవకాశాన్ని పొందనున్నారు.
ఈ చిత్ర కథ విషయానికి వస్తే, వివేక్ గోపినాథ్ (ఆసిఫ్ అలీ) ఒక శక్తివంతమైన పోలీస్ అధికారి. అయితే, అతను అనుకోని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. అనంతరం గ్యాంబ్లింగ్ స్కామ్(Gambling Scam) కారణంగా, తన జీవితంలో కష్టాల్ని ఎదుర్కొంటాడు. ఈ సమయంలో అతనికి 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు విచారణ చేసే అవకాశం వస్తుంది. ఈ కేసును ఛేదించి, తానే గొప్ప డిటెక్టివ్ అని నిరూపించుకోవాలని అతను ప్రయత్నిస్తాడు.
జోఫిన్ టి. చాకో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనస్వర రాజన్, మనోజ్ కె. జయన్ కీలక పాత్రలు పోషించారు. కంటెంట్ ప్రధానంగా ఉండే ఈ చిత్రం, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సూపర్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ(Cinematography), బ్యాక్‌గ్రౌండ్ స్కోర్(Background Score) ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి. రొటీన్ కథలకు భిన్నంగా, కొత్తదనంతో రూపొందిన ఈ సినిమా తప్పక చూడాల్సిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.