
టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్, నటన మాత్రమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో కూడా అందరి మన్ననలు పొందుతున్నారు. మహిళలు, పిల్లలు, మూగ జీవాల సంక్షేమం కోసం ఆమె ప్రారంభించిన ఎన్జీవో (NGO) ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదనంగా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని వినిపిస్తూ, సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు.
తాజాగా, రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆమె ఇటీవల కాశీ ఘాట్ ప్రాంతంలో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. “గత కొన్ని రోజులుగా నేను మానవత్వం మరియు మూర్ఖత్వం ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూశాను. పొరపాటున మెయిన్ రోడ్డుపైకి వెళ్లినప్పుడు, జనాలు ఒకరినొకరు తోసుకోవడం, అరవడం, అశిస్తంగా ప్రవర్తించడం చూశాను. ఎటువంటి సామాజిక స్పృహ లేకుండా, రోడ్లపై స్టుపిడ్ డీజే మ్యూజిక్ పెట్టి అరుస్తూ డ్యాన్స్‌లు చేయడం చూసి ఆశ్చర్యపోయాను” అని వెల్లడించారు.
రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో ఈ సంఘటనను ఏ ఒక్క మతాన్ని ఉద్దేశించి చెప్పడం లేదని స్పష్టం చేశారు. “నేను అన్ని మతాలను గౌరవిస్తాను. కానీ భక్తి పేరుతో ఇతరులకు అసౌకర్యం కలిగించడం సరైనది కాదని నా అభిప్రాయం. మనుషులు తమ వివేకాన్ని కోల్పోయినట్లు అనిపిస్తోంది. కలియుగం అంటే ఇదేనేమో అనిపిస్తోంది!” అని తాను అనుకున్న విషయాలను ఓపెన్‌గా పంచుకున్నారు.
ఆమె చేసిన ఈ సాహసోపేతమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆమె అభిప్రాయాన్ని మద్దతు ఇస్తూ, మరికొందరు వ్యతిరేకిస్తూ తమ స్పందన తెలియజేస్తున్నారు. సమాజానికి సంబంధించి తన అభిప్రాయాలను బహిరంగంగా పంచుకునే తత్వం రేణూ దేశాయ్‌ను మరింత ప్రత్యేకంగా నిలిపేస్తోంది.