టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ మరోసారి సామాజిక అంశాలపై తన గళాన్ని వినిపించింది. తన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రేణూ, మహిళలు, చిన్న పిల్లలు, అలాగే మూగ జీవాల సంక్షేమానికి కృషి చేస్తూ ముందుకు సాగుతోంది. సినిమాల నుంచి దూరంగా ఉన్నా, సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై తన దృఢమైన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజాగా, ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ షోలో రణ్ వీర్ అలహాబాదియా, అపూర్వ మఖిజా, సమయ్ రైనా చేసిన అభ్యంతరకర, మహిళా వ్యతిరేక వ్యాఖ్యల గురించి స్పందించింది.
ఈ వివాదాస్పద కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసాయి. “మీ పిల్లలను బాధ్యతగా పెంచాలనుకుంటే, రణ్ వీర్ లాంటి వ్యక్తులను అన్‌ఫాలో చేయండి. యువత బాధ్యతగా ఉండాలి. ‘Freedom of Speech’ అనే పేరుతో వల్గారిటీని అంగీకరించడం ఎంతమాత్రం సరికాదు” అని రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పంచుకున్న సందేశం వైరల్‌గా మారింది. చాలా మంది నెటిజన్లు ఆమె అభిప్రాయాలకు మద్దతు ప్రకటిస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్ర సైబర్ సెల్ ఈ వివాదానికి సంబంధించి FIR నమోదు చేసింది. పోలీసులు రణ్ వీర్, అపూర్వ, సమయ్ రైనా కోసం గాలిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, రణ్ వీర్ తన స్నేహితుడి ఇంట్లో దాక్కున్నాడు అని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై ఈ షోకు సంబంధించిన వీడియోలన్నీ తొలగించాలని మహారాష్ట్ర సైబర్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
రేణూ దేశాయ్ చేసిన బాధ్యతాయుతమైన ప్రకటన యువతలో అవగాహన కలిగించేలా మారింది. సామాజిక బాధ్యత కలిగిన సెలబ్రిటీల బాధ్యతగా ఉండాలి అనే సందేశాన్ని ఈ ఘటన స్పష్టం చేసింది. రేణూ దేశాయ్ ఈ వివాదంపై మరిన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తుందా? రణ్ వీర్, సమయ్ రైనా, అపూర్వ మఖిజా పై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటారా? వేచిచూడాలి.