మంచి సినిమాలను కూడా కొందరు తమ విశ్లేషణలతో కిల్ చేస్తున్నారని, ప్రేక్షకులకు చేరువ కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ఆయన రీసెంట్ మూవీ రోమియో విషయంలో ఆయన ఇలా స్పందించారు. రోమియో సినిమా తెలుగులో లవ్ గురు పేరుతో రిలీజైంది. ద్వేషించే భార్యను ప్రేమించే భర్త కథ ఇది. ప్రేమతోనే భార్యను భర్త ఎలా మార్చుకున్నాడు అనేది కథాంశం. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ నిర్మించగా…వినాయక్ దర్శకత్వం వహించారు. మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది.

విజయ్ ఆంటోనీ సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ – కొంతమంది తమకే సినిమా పరిజ్ఞానం మొత్తం తెలుసు అనుకుంటున్నారు. వారు ఇచ్చే విశ్లేషణల వల్ల మంచి సినిమా కూడా ప్రేక్షకులకు రీచ్ కాలేకపోతున్నాయి. మంచి సినిమాకు ప్రేక్షకులకు మధ్య అడ్డు గోడలా కొందరి రివ్యూలు నిలుస్తున్నాయి. ప్రేక్షకులు సినిమా చూసే తమ అభిప్రాయం చెప్పాలి. ఇలాంటివి నమ్మి సినిమాలు చూడకుండా ఉండకూడదు. అని అన్నారు. ఇటీవల రంజాన్ సందర్భంగా రోమియో, లవ్ గురు సినిమాలు తమిళం, తెలుగులో రిలీజ్ అయ్యాయి.