కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్) కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. భూటాన్ నుంచి లగ్జరీ వాహనాలను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు అనుమానిస్తూ, సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారుల ఇళ్లపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొచ్చిలోని మలయాళ స్టార్ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కూడా అధికారులు విచారణ చేశారు.
‘ఆపరేషన్ నమ్‌ఖోర్’ (భూటాన్ భాషలో వాహనం) పేరుతో కేరళ అంతటా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టి పురం, త్రిస్సూర్ సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. అధికారులు భూటాన్ నుంచి హై-ఎండ్ లగ్జరీ SUVలు ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి వాహనాలను అక్రమంగా భారత్‌లోకి దిగుమతి చేసుకున్నారని అనుమానిస్తున్నారు. భూటాన్‌లో ఈ వాహనాలను మొదట రూ.5 లక్షలకంటే తక్కువ ధరలో కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నంబర్ ప్లేట్‌తో రీమోడల్ చేసి, దాదాపు రూ.40 లక్షల వరకు అమ్ముతారు. అసలు ధర కోట్లలో ఉండే ఈ వాహనాలను పన్నులు చెల్లించకుండా విక్రయించడం వలన పన్ను చెల్లింపు తప్పులు జరుగుతున్నాయని అధికారులు ఆరోపిస్తున్నారు.
కొంతమంది మలయాళ నటులు వాటిలో కొన్నింటిని కొనుగోలు చేశారని కస్టమ్స్ అనుమానించింది. దీంతో దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపై కూడా దాడులు జరిగాయి. అయితే, ఆ ఇద్దరి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని అధికారులు ధ్రువీకరించారు. ఈ రవాణా వెనుక హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక రాకెట్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
భూటాన్‌లోని వాహనాలను వేలంలో తక్కువ ధరలకు విక్రయించి, భారతదేశంలో కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా అక్రమంగా దిగుమతి చేస్తున్నారు. తరువాత వాటిని హిమాచల్ ప్రదేశ్‌కు రవాణా చేసి, తాత్కాలిక చిరునామాలను ఉపయోగించి నమోదు చేస్తారు. ఈ విధంగా నటులు, వ్యాపార ప్రముఖులకు అధిక ధరలకు విక్రయిస్తారు. భూటాన్‌లో చట్టబద్ధంగా విక్రయించినప్పటికీ, సరైన పన్ను చెల్లించకుండా భారతదేశంలో దిగుమతి చేయడం సెలబ్రిటీలకు కూడా సమస్యలకు దారి తీస్తుంది.