
2012లో వచ్చిన “అనుకోకుండా” అనే తెలుగు షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆమె ప్రతిభను చాటుకుంది రీతూ వర్మ. ఈ చిత్రం 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు గెలుచుకుంది. రీతూ వర్మకు ఉత్తమ నటి అవార్డు అందించడంతో పాటు, 2013లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్‌లో ప్రదర్శించబడింది. ఆమె మొదటి సినిమా “బాద్షా”, కానీ నిజమైన గుర్తింపు “ఎవడే సుబ్రమణ్యం” సినిమాతో వచ్చింది.
2016లో విజయ్ దేవరకొండ సరసన నటించిన “పెళ్లి చూపులు” చిత్రంతో ఆమె కెరీర్‌లో బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు లభించాయి. అనంతరం “కేశవ”, “వరుడు కావలెను”, “ఒకే ఒక జీవితం” వంటి చిత్రాల్లో ఆకట్టుకుంది. 2024లో “స్వాగ్” చిత్రంలో నటించి, ప్రస్తుతం “మజకా” చిత్రంలో కనిపించనుంది.
10 మార్చి 1990న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జన్మించిన రీతూ వర్మ, సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కుటుంబ మూలాలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందినవైనప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది, ఇది ఆమె ప్రతిభను మరింత చాటిచెప్పింది.
రీతూ వర్మ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది. ఆమె విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి, మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పొందింది. సినిమా రంగంలోకి అడుగుపెట్టే ముందు “మిస్ హైదరాబాద్” బ్యూటీ పోటీలో పాల్గొని ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయమే ఆమెను మోడలింగ్, నటన వైపు తీసుకెళ్లింది.