Published on Oct 21, 2024 8:32 AM IST
కీర్తన ప్రొడక్షన్స్ పతాకంపై రమాకాంత్, అవంతిక, భానుశ్రీ హీరో హీరోయిన్లుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో బధావత్ కిషన్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సముద్రుడు’ అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. హీరో సుమన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దర్శకుడు వి.సముద్ర మరియు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ.. ‘‘సముద్రుడు’ టైటిల్ దర్శకుడు నగేష్ నన్ను చూసి పెట్టడం జరిగింది. రమాకాంత్ మంచి హీరో అవుతాడని తారకరత్న గారు ఎప్పుడో చెప్పారు. ఆ మాటని నిజం చేస్తూ ఈరోజు రమాకాంత్ హీరోగా సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం ప్రేక్షకులు సక్సెస్ రూపంలో ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ.. ‘నగేష్ దర్శకుడుగా దర్శకత్వం ఒకటే కాకుండా 24 శాఖల పైన పట్టు సాధించి నిర్మాతకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రమోషన్స్ డిస్ట్రిబ్యూషన్ అన్ని చూసుకున్న వ్యక్తి. అదేవిధంగా ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ ముఖ్యంగా సుమన్ తన సినిమాగా భావించి ప్రతి ఈవెంట్లో ప్రమోషన్స్లో పాల్గొనడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సినిమా ప్రేక్షకులు అందరూ ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నిర్మాత కీర్తన మాట్లాడుతూ.. ‘మా ఈ సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన దర్శకుడు వి.సముద్ర గారికి టి.ప్రసన్న కుమార్ గారికి హీరో సుమన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దర్శకుడు నగేష్ గారు, హీరో రమాకాంత్, అవంతిక, భానుశ్రీ ఇలా ఈ సినిమాలో నటించి సపోర్ట్ చేసిన నటీనటులందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకుల సినిమాని ఆదరించి విజయాన్ని చేకూరుస్తారని ఆశిస్తున్నాను.’ అని అన్నారు.
దర్శకుడు నగేష్ నారదాసి మాట్లాడుతూ..‘మా సముద్రుడు సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి సపోర్ట్ చేస్తున్న దర్శకుడు వి.సముద్ర గారికి టి.ప్రసన్నకుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా జాలర్ల జీవితాన్ని చూపించే డాక్యుమెంటరీ ఫిలిం లా కాకుండా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తీసిన ఒక మంచి సినిమా. సముద్రం దగ్గర ఉండే జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళినప్పుడు పడే కష్టాలు వాళ్లకు వచ్చే సమస్యల్ని ఈ చిత్రంలో చూపించడం జరిగింది. రమాకాంత్ కచ్చితంగా ఈ సినిమాతో ఒక పెద్ద హీరో అవుతాడు. ఈ సినిమా కోసం కష్టపడి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కి ఆర్టిస్ట్ కి కృతజ్ఞతలు. ఈనెల 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రేక్షకులందరూ ఈ సినిమాని చూసి ఆదరించి సక్సెస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.’ అని అన్నారు.