
భయానక సినిమాలంటే ప్రత్యేకమైన ఆసక్తి కలిగినవారికి ‘ది ఎక్సార్సిస్ట్’ గురించి తెలుసుకోవాల్సిందే. 1973లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా హారర్ సినిమాలకు కొత్త పరిమాణాన్ని ఇచ్చింది. అయితే, ఈ సినిమా పేరు శాపగ్రస్తమైన హారర్ మూవీగా కూడా వినిపించింది. సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లలో ప్రేక్షకులు అస్వస్థతకు గురయ్యారు, వాంతులు చేసుకున్నారు, కొంతమంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనలు మరింత భయానకంగా మారాయి. ఒకసారి సెట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది, కానీ ఆశ్చర్యకరంగా హీరోయిన్ లిండా బ్లెయిర్ బెడ్రూమ్ సెట్ మాత్రం భద్రంగా మిగిలిపోయింది. ప్రధాన నటి ఎల్లెన్ బర్స్టిన్ తీవ్రంగా గాయపడింది, నటీనటులు వింత అనుభవాలను ఎదుర్కొన్నారు. అంతేకాకుండా, సినిమాలో భూతవైద్యుడిగా నటించిన వ్యక్తికి నిజంగా దెయ్యం పట్టిందని కూడా పుకార్లు వినిపించాయి.
సినిమా థియేటర్లలో విడుదలైన తరువాత కూడా భయంకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. చాలా మంది ప్రేక్షకులు గుండె పోటు, తలనొప్పి, వాంతులతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ సినిమాను చూసిన కొందరు ప్రాణాలు కోల్పోయారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, ఇది నిజమా? లేక భయం కారణంగా మరింతా ఊహించుకున్నారా? అనేది ఇంకా అనుమానంగా ఉంది.
ఇన్ని భయానక సంఘటనలు జరిగినప్పటికీ, ‘ది ఎక్సార్సిస్ట్’ హారర్ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రం 10 ఆస్కార్ నామినేషన్లు పొందిన తొలి హారర్ మూవీగా గుర్తింపు సాధించింది. రెండు ఆస్కార్ అవార్డులు, నాలుగు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకుంది. ఇది ఇప్పటికీ భయానక సినిమాల చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన చిత్రంగా నిలిచింది.