
కన్నడ నటి రన్యా రావు ఇటీవల బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మార్చి 3న బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు ఆమెను 14.8 కిలోల బంగారంతో పట్టుకున్నారు. ఆమె అక్రమ రవాణా వ్యవహారాన్ని ఛేదించేందుకు గత ఆరు నెలలుగా డీఆర్‌ఐ నిఘా పెట్టినట్లు సమాచారం. రన్యా రావు తన ట్రావెల్ హిస్టరీ వల్ల అనుమానాస్పదంగా మారింది.
రన్యా రావు భర్తే ఈ కేసును డీఆర్‌ఐ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. పెళ్లయిన రెండు నెలలకే ఆమె తరచుగా విదేశీ పర్యటనలు చేయడం, అనుమానాస్పద కదలికలు ఉండటంతో భర్త అనుమానించి అధికారులకు సమాచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆమె బెంగళూరులోని నివాసాన్ని పరిశీలించగా, భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మరో కీలక విషయం ఏంటంటే, ఎయిర్‌పోర్టులోని ప్రోటోకాల్ విభాగాన్ని రన్యా రావు ఉపయోగించినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఉన్న ప్రముఖ ఐపీఎస్ అధికారి రామచంద్ర రావు పేరు ఈ స్కాంలో వినిపించడం అధికారులను మరింత అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
స్మగ్లింగ్ వ్యవహారంలో రన్యా రావుతో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నారేమోనని CBI దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. రన్యా రావు అక్రమ రవాణా నెట్‌వర్క్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.