జార్జ్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. ఆయన అందించిన కథతో “సింగరేణి జంగ్ సైరెన్” అనే కొత్త సినిమా తెరకెక్కుతోంది. 1999 సంవత్సరంలో సింగరేణిలో జరిగిన ఓ యదార్థ ఘటన నేపథ్యంతో ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రాన్ని ధూమ్ర వారాహి బ్యానర్ పై నూతన దర్శకుడు వివేక్ ఇనుగుర్తి రూపొందించనున్నారు. ఇవాళ ఈ సినిమాను అనౌన్స్ చేశారు. ఈ సర్వైవల్ డ్రామా మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే “సింగరేణి జంగ్ సైరెన్” సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా నటీనటులు, ఇతర వివరాలు ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే రోజున ప్రకటించనున్నారు.

“సింగరేణి జంగ్ సైరెన్” సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో బొగ్గు నింపిన లాడీసు (ట్రాలీ)లో గని కార్మికుడి టోపీ ఉంది. బొగ్గులో ఆ టోపీ కలిసి వస్తుందంటే ఆ కార్మికుడికి ఏదో ప్రమాదం జరిగిందని అనుకోవాలి. భూగర్భంలో పనిచేసే సింగరేణి కార్మికులు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటారు. రూఫ్ కూలి మృతి చెందడం ఎక్కువగా జరుగుతుంటుంది. గనిలో దారి తప్పి కార్మికులు చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన వృత్తిగా భావించే సింగరేణిలో ప్రాణాల కోసం పోరాడే సందర్భాలు అనేక వస్తాయి. అలాంటి ఓ ఘటనను “సింగరేణి జంగ్ సైరెన్” సినిమాకు ఇతివృత్తంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది.