తమిళ హీరో శివకార్తికేయన్ తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ వంటి హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, తెలుగు దర్శకుడు అనుదీప్ తెరకెక్కించిన ‘ప్రిన్స్’ సినిమాతో మరింత చేరువయ్యాడు. ఇటీవల విడుదలైన ‘అమరన్’ సినిమాతో తమిళ, తెలుగు భాషల్లో విజయాన్ని అందుకున్నాడు.
సినీ కెరీర్ ప్రారంభానికి ముందు, శివకార్తికేయన్ తమిళ టెలివిజన్ షోలలో హోస్ట్‌గా పేరు సంపాదించాడు. ‘జోడి’, ‘దిస్’ వంటి షోల ద్వారా ప్రజాదరణ పొందిన ఆయన, చిన్న తెర నుంచి పెద్ద తెరకు హాస్యనటుడిగా అరంగేట్రం చేశాడు. 2012లో పాణిరాజ్ దర్శకత్వం వహించిన ‘మెరీనా’ సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ‘పసంగ’ చిత్రంలో అతను కీలక పాత్ర పోషించాడు. ధనుష్, శ్రుతిహాసన్ నటించిన ‘3’ సినిమాలోనూ తన పాత్రతో ఆకట్టుకున్నాడు.
శివకార్తికేయన్ నటుడిగానే కాకుండా గాయకుడిగా, నిర్మాతగా, గేయ రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. హాస్యభరిత చిత్రాలతో పాటు సెంటిమెంట్, యాక్షన్ సినిమాల్లోనూ నటించి ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. ‘డాక్టర్’, ‘మావీరన్’, ‘అమరన్’ వంటి చిత్రాలు అతనికి నటుడిగా మరింత పేరు తెచ్చాయి.
ఇటీవల శివకార్తికేయన్ చేసిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “గత రెండేళ్లుగా నేను సోషల్ మీడియాను వాడడం మానేశాను. ఆ అలవాటు మానేయడంతో నా నిర్ణయాల్లో స్పష్టత పెరిగింది. నా వ్యక్తిగత జీవితంలోనూ చాలా మార్పులు వచ్చాయి” అని వెల్లడించాడు. అభిమానులు, సినీ పరిశ్రమలోని వ్యక్తులు అతని ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.