
ఇప్పటి రోజుల్లో ఒక పాట హిట్ అవ్వడం చాలా కష్టం. అందుకే మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పటికే పాపులర్ అయిన ప్రైవేట్ సాంగ్స్‌ని సినిమాల్లో వాడే కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతున్నారు. చిరంజీవి నుంచి చిన్న హీరోల వరకూ ఈ ఫార్ములా బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా యూట్యూబ్‌లో సెన్సేషన్ అయిన పాటలు టాలీవుడ్‌లో మళ్లీ పునర్జన్మ పొందుతున్నాయి. టాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడు ప్రైవేట్ సాంగ్స్ వాడటం ఓ కొత్త మోడల్ అయిపోయింది.
పవన్ కళ్యాణ్ “తమ్ముడు” సినిమాలో “ఏం పిల్ల మాటాడవా” పాట అప్పట్లో హిట్ అయింది. ఇక ఇటీవల “భోళా శంకర్” లో మంగ్లీ పాడిన “ఆడునెమలి” పాటను చిరంజీవి రీమిక్స్ చేసుకున్నారు. అలాగే “ధమాకా” సినిమాలో వచ్చిన “పల్సర్ బైక్” పాట కూడా ఇదే కోవలో చేరింది. థియేటర్స్‌లో రవితేజ, శ్రీలీల స్టెప్పులకు ప్రేక్షకులు విజిల్స్‌తో మోత మోగించారు. ఇప్పుడు “మజాకా” సినిమాలో “సొమ్మసిల్లిపోతున్నవే నా చిన్ని రాములమ్మా” అనే ప్రైవేట్ సాంగ్‌ను తీసుకున్నారు. ఈ లిస్ట్‌లో “రాజా ది గ్రేట్” లోని “గున్నా గున్నా మామిడి”, “కోట బొమ్మాళి” లోని “లింగి లింగి లింగిడి” పాటలు కూడా ఉన్నాయి.
నాని “దసరా” లో “చిత్తూ చిత్తూల బొమ్మ” అనే బతుకమ్మ పాటను సంతోష్ నారాయణన్ తన మ్యూజిక్‌తో అద్భుతంగా మలిచారు. “లవ్ స్టోరీ” లో “సారంగ దరియా” ను, “అల వైకుంఠపురములో” లో “రాములో రాములా” ను మోడ్రన్ టచ్ ఇచ్చి ఫిల్మ్ మేకర్స్ సినిమాలకు కొత్త హైలైట్‌గా మార్చేశారు. కరోనా టైంలో వైరల్ అయిన “నాది నకిలీసు గొలుసు” పాట “పలాస 1978” లో చోటు చేసుకుంది. అలాగే “బోనాల” పండగ సందర్భంగా పాడే “నువ్ పెద్ద పులినెక్కినావమ్మో” పాటను “ఛల్ మోహన్ రంగా” లో రీమిక్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫోక్ సాంగ్స్‌ని సినిమాల్లో వాడటంలో ముందుంటారు. “తమ్ముడు” లో “తాటిచెట్టెక్కలేవు”, “ఖుషీ” లో “బై బై బంగారు రమనమ్మా”, “జానీ” లో “నువ్వూ సారా తాగుడు మాను లింగం”, “అత్తారింటికి దారేది” లో “కాటమరాయుడా” వంటి పాటలు అసలు ప్రైవేట్ పాటలకే బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయాయి.