Published on Nov 5, 2024 7:03 AM IST
ప్రేమమూర్తి అయిన ఓ తల్లి తన జీవిత గమనంలో ఎలాంటి భావోద్వేగాలకు గురైంది అనే ఇతివృత్తంతో “తల్లి మనసు” అనే సినిమాను తెరకెక్కించారు. రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్నారు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్(సిప్పీ) ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి కావచ్చిన నేపథ్యంలో ఈ చిత్రం గురించి నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ.. “ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్తో పాటు రీ-రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుని తుది మెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే తొలికాపీ సిద్దమవుతుంది. అటుపై సెన్సార్ పూర్తి చేసుకున్నాక, ఈ నవంబర్ నెలలోనే విడుదల చేస్తాం. డబ్బింగ్, రీ-రికార్డింగ్ దశలో ఈ చిత్రానికి పనిచేయని కొందరు ఈ చిత్రాన్ని చూసి, ఓ మంచి చిత్రాన్ని తీశారని ప్రశంసించడం ఆనందంగా ఉంది. సంగీత దర్శకుడు కోటి సైతం చాలా మంచి చిత్రాన్ని తీశారని అభినందించారు” అని అన్నారు.
చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ.. “మంచి కథ, కథనాలు ఒక ప్లస్ పాయింట్ అయితే.. వాటిని తెరపైన తీర్చిదిద్దిన విధానం మరొక ప్లస్ పాయింట్. మొత్తం మీద మాకు చాలా సంతృప్తినిచ్చిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది” అని అన్నారు.
దర్శకుడు వి.శ్రీనివాస్(సిప్పీ) మాట్లాడుతూ..‘ఓ మధ్య తరగతి తల్లి ఎలాంటి సంఘర్షణలకు గురయ్యిందన్న అంశాన్ని ప్రేక్షకులకు హత్తుకునేలా తెరకెక్కించాం. నిర్మాత అభిరుచి కూడా చిత్రం చాలా బాగా రావడానికి దోహద పడింది. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా.’ అని అన్నారు.