Published on Dec 2, 2024 8:21 AM IST
‘డియర్ కృష్ణ’ సినిమా ద్వారా పీఎన్ బలరామ్ రచయితగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. దినేష్ బాబు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ ని ప్రేరణగా తీసుకొని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘డియర్ కృష్ణ’ చిత్రంలో యువ సంచలనం, ‘ప్రేమలు’ చిత్రం ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రచార చిత్రాలతో, లక్ష రూపాయల కాంటెస్ట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ‘డియర్ కృష్ణ’పై మంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం, ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ప్రెస్ మీట్ లో శ్రీ కృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ, ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేయడం విశేషం. రచయిత, నిర్మాత పి.ఎన్. బలరామ్ మాట్లాడుతూ, “నేను ఈ సినిమాకి నిర్మాతగా భావించట్లేదు. కృష్ణుడి సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న వ్యక్తిగానే భావిస్తున్నాను. కృష్ణుడి వల్ల మా కుటుంబంలో జరిగిన మిరాకిల్ నే కథగా తీసుకొని, డియర్ కృష్ణ సినిమాని రూపొందించడం జరిగింది. అదేంటంటే మా కుమారుడు అక్షయ్ అత్యంత రేర్ డిసీజ్ నుంచి, డాక్టర్లే ఆశ్చర్యపోయేలా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ సినిమాలో అక్షయ్ నే హీరోగా నటించాడు. ఈ చిత్రం కోసం మేము స్టార్స్ ని తీసుకోవాలి అనుకోలేదు. ఎందుకంటే కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్. మమ్మల్ని, మా సినిమాని కృష్ణుడే నడిపిస్తాడు.” అన్నారు.
కథానాయకుడు అక్షయ్ మాట్లాడుతూ, “నా జీవితంలో జరిగిన మిరాకిల్ ప్రేరణగా తీసుకొని రూపొందుతోన్న ఈ చిత్రంలో నేను నటించడం సంతోషంగా ఉంది. మా కుటుంబానికి, కృష్ణుడికి మధ్య నడిచే ప్రేమ కథే ఈ చిత్రం. మా నాన్న నాకు జన్మని ఇవ్వడమే కాదు, పునర్జన్మను కూడా ఇచ్చారు. ఆయన వల్లే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉన్నాను. విజయ్ గారి 69 వ సినిమా షూటింగ్ లో ఉండటం వల్ల మమిత ఈ ప్రెస్ మీట్ కి రాలేకపోయింది. త్వరలో జరిగే ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొంటుంది.” అన్నారు.
కథానాయిక ఐశ్వర్య మాట్లాడుతూ, “నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు దినేష్ బాబు గారికి, నిర్మాత బలరామ్ గారికి కృతజ్ఞతలు. అక్షయ్, మమిత, లోహిత్ గారు లాంటి ఎందరో ప్రతిభగల నటీనటులు ఉన్న ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది.” అన్నారు.