Published on Nov 12, 2024 10:30 AM IST
రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ‘ఉయ్యాలా జంపాల’, ‘మజ్ను’ సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నేడు ఈ సినిమాని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు వీక్షించి జితేందర్ రెడ్డితో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ.. ‘గతంలో నేను జితేందర్ రెడ్డి గారు కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసాము. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను సంఘటితం చేసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ల కోసం నిలబడిన వ్యక్తి. వరంగల్ లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారి సభకు తనవంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ ని విజయవంతం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా వెనుతిరగకుండా ప్రజల కోసం ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి. 72 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపి నక్సలైట్లు అయినను ఏవిధంగా హత్య చేశారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. రవీందర్ రెడ్డిగారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా మంచి విషయం. ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు.’ అని అన్నారు.