ఇంటర్వ్యూ: వెంకీ అట్లూరి – ‘లక్కీ భాస్కర్’ బాగుందని అందరూ చెప్పడం సంతోషం కలిగించింది. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 7, 2024 4:03 PM IST

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’ దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ‘లక్కీ భాస్కర్’ చిత్రాన్ని నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయిక. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఈ మూవీ సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘లక్కీ భాస్కర్’ విజయం ఎలాంటి సంతృప్తిని ఇచ్చింది?
చాలా చాలా సంతృప్తిని ఇచ్చింది. అందరూ కథ విని బాగుంది అన్నారు. కొందరు మాత్రం కథ బాగుంది కానీ, కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా అనే సందేహం వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నా మొదటి సినిమా ‘తొలిప్రేమ’ విజయం సాధించినప్పటికీ, ఒక ఐదు శాతం మంది ప్రేమకథే కదా అన్నట్టుగా కాస్త నెగటివ్ గా మాట్లాడారు. కానీ ‘లక్కీ భాస్కర్’కి మాత్రం ఒక్క శాతం కూడా అలాంటి నెగటివ్ స్పందన రాలేదు. ప్రీమియర్ల నుంచే అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. ఒక సినిమాని ఇలా చూసిన వారందరూ బాగుందని చెప్పడం నిజంగా గొప్ప విషయం. అదృష్టంగా భావిస్తున్నాను.

కథ విన్న తర్వాత దుల్కర్ గారి మొదటి స్పందన ఏంటి?
ఫస్ట్ హాఫ్ వినగానే ఈ సినిమా నేను చేస్తున్నాను అని దుల్కర్ చెప్పారు. షూటింగ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఎన్నిరోజుల డేట్స్ కావాలి? అని అడిగారు. ‘లక్కీ భాస్కర్’ విజయం సాధిస్తుందని దుల్కర్ బలంగా నమ్మారు.

సెట్ లో దుల్కర్ ఎలా ఉండేవారు?
సినిమా సెట్ లో హీరోనే మెయిన్ పిల్లర్. హీరో డల్ గా ఉంటే సెట్ మొత్తం డల్ గా ఉంటుంది. దుల్కర్ ఉదయం రావడమే ఫుల్ ఎనర్జీతో వచ్చేవారు. ఆయన ఈ కథని నమ్మడం వల్ల, సెట్ లో అంత సంతోషంగా ఉండటం వల్లే ఇంతమంచి అవుట్ పుట్ వచ్చింది. సన్నివేశాలు, సంభాషణలు చదివి బాగున్నాయని అభినందించే వారు. దాని వల్ల మరింత ఉత్సాహంగా ఇంకా మెరుగ్గా రాసేవాడిని.

నాగవంశీ గారు విడుదలకు ముందు ఇందులో తప్పు చూపిస్తే పార్టీ ఇస్తా అన్నారు కదా.. మొదటి నుంచి ఆయన అంతే నమ్మకంతో ఉన్నారా?
మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందని నేను అనుకోలేదు. నిజమైన లొకేషన్స్ లో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలో ఉన్నాను. కానీ వంశీ గారు ఈ కథని ఎంతో నమ్మారు. కథకి తగ్గ భారీతనం తీసుకురావడం కోసం సెట్లు వేయాలని నిర్ణయించారు. కథని అంతలా నమ్మారు కాబట్టే వంశీ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని భారీస్థాయిలో నిర్మించారు.

బ్యాంకింగ్ నేపథ్యం కదా.. కథ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
ఎంతో రీసెర్చ్ చేశాను. కొన్ని సిరీస్ లు చూశాను. అయితే అవి టెక్నికల్ గా సాధారణ ప్రేక్షకులు అర్థం చేసుకునేలా లేవు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకొని.. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని రాసుకోవడం జరిగింది.

లక్కీ భాస్కర్ విషయంలో వచ్చిన గొప్ప ప్రశంస ఏంటి?
ఒక్కటని కాదు, ఒక్కరని కాదు. అందరూ సినిమా బాగుందని ప్రశంసిస్తున్నారు.

మీ తదుపరి చిత్రం ఎలా ఉండబోతుంది?
ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. ఖచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తాను.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *