
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన విభిన్నమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. కేవలం సినిమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ఆయన ముందు వరుసలో ఉంటారు. తాజాగా, విజయ్ సేతుపతి దక్షిణ భారత చలనచిత్ర కార్మికుల సంఘానికి (FEFSI) రూ. 1.30 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని సినీ కార్మికుల గృహ నిర్మాణానికి వినియోగించనున్నారు.
ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు రమేష్ బాలా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. విజయ్ సేతుపతి చేసిన ఈ గొప్ప పనికి గుర్తుగా, అక్కడ నిర్మించబోయే భవనానికి “విజయ్ సేతుపతి టవర్” అని పేరు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. విజయ్ సేతుపతి చేసిన ఈ మానవతా కార్యక్రమానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గత ఏడాది విజయ్ సేతుపతి నటించిన “మెర్రీ క్రిస్మస్,” “మహారాజా,” మరియు “విడుదలై 2” సినిమాలు విడుదలయ్యాయి. ఈ సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం ఆయన “గాంధీ టాక్స్,” “ఏస్,” మరియు “ట్రెయిన్” వంటి సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
విజయ్ సేతుపతి సినీ కార్మికులకు సహాయం చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన చేసిన ఈ విరాళం సినీ కార్మికులకు ఎంతో సహాయపడుతుంది.