
కొన్ని సినిమాలు కేవలం ఓ ఫిల్మ్ గా కాకుండా జీవిత అనుభవంలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతాయి. అటువంటి సినిమాల్లో ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేకమైనదిగా నిలిచింది. వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, తన సహజమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. జీవితంలోని వాస్తవ సంఘటనలు, సామాన్య జనాల భావోద్వేగాలు ఈ సినిమాను మరింత హృదయానికి దగ్గరయ్యేలా చేశాయి. అందులోని పాత్రలు, కథా నిర్మాణం ప్రేక్షకులకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి.
ఈ సినిమాలో నటించిన పరుచూరి విజయ ప్రవీణ గుర్తున్నారా? సినిమాలో చిన్న పాత్ర అయినా ఆమె నటన ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. కానీ ఆమె కేవలం నటి మాత్రమే కాదు, ఈ సినిమాకు నిర్మాత కూడా. విజయ ప్రవీణ అమెరికాలోని న్యూయార్క్ లో ‘సెయింట్ జార్జ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ లో చదివి కార్డియాలజిస్ట్ గా స్థిరపడ్డారు. ఇండియాకు వచ్చినప్పుడు దర్శకుడు వెంకటేష్ మహా తో పరిచయం ఏర్పడి, సినిమాల నిర్మాణం వైపు అడుగుపెట్టారు.
సినిమాలోని సలీమా పాత్రకు అనేకమంది ఆడిషన్ ఇచ్చినా ఎవరు సరిగ్గా సెట్ కాకపోవడంతో విజయ ప్రవీణ తానే ఆ పాత్ర పోషించారు. ఆమె ప్రతిభను అందరూ ప్రశంసించారు. తర్వాత ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ అనే చిత్రంలో కూడా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. అయితే, సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న విజయ ప్రవీణ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు, దీంతో నెటిజన్స్ ఆమె గురించి గూగుల్ లో సర్చ్ చేస్తున్నారు.