
కన్నడ నటి రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన విషయం ప్రస్తుతం కర్ణాటకలో చర్చనీయాంశంగా మారింది. బెంగుళూరు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని, విచారణ కోసం రెవెన్యూ ఇంటలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) కస్టడీకి అప్పగించారు. కస్టడీ సమయంలో ఆమెపై దాడి జరిగిందా అనే అనుమానాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాజ మాధ్యమాల్లో రన్యా రావు ఫోటోలు పెద్ద ఎత్తున షేర్ అవుతున్నాయి. ఫోటోలో ఆమె ముఖంపై గాయాలు, కళ్లు ఉబ్బిపోయినట్లు కనిపించడంతో, పోలీసులు దాడి చేశారా? అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే, ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి మాట్లాడుతూ, “రన్యా అధికారికంగా ఫిర్యాదు చేయకపోతే మేము దర్యాప్తు ప్రారంభించలేం. చట్టం తన పని తాను చేసుకోవాలి, ఎవరిపైనా దాడి చేసే హక్కు ఎవరికి లేదు” అని స్పష్టం చేశారు.
ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రన్యా ఫిర్యాదు చేస్తే, మహిళా కమిషన్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తగిన ఆధారాలు లేకుండా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఫైర్ అవుతుందని, పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం నిజాలు బయటకు వస్తాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం రన్యా రావు తనపై వచ్చిన ఆరోపణలకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఆమెపై ఉన్న కేసును న్యాయపరంగా ఎదుర్కొంటుందా? లేక మరింత వివాదంలో ఇరుక్కుంటుందా? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.