హీరో విశాల్ అటు తమిళ్ ప్రేక్షకులకు, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. పందెం కోడి సినిమాతో కేరిర్ బెస్ట్ హిట్ అందుకున్న సెల్యూట్, పూజా పొగరు సినిమాలతో విశాల్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతేడాది మార్క్ ఆంటోనీతో కెరీర్ లో తొలిసారి వందకోట్ల మార్క్ ను అందుకున్నాడు. కాగా విశాల్ నటించిన ఓ సినిమా గత 12 ఏళ్లుగా రిలీజ్ కు నోచుకోలేదు.
విశాల్ హీరోగా తమిళ ప్రముఖ దర్శకుడు సుందర్ సి డైరెక్షన్ లో ‘మదగజరాజ’అనే సినిమా తెరకెక్కింది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా 2012లో షూటింగ్ ఫినిష్ చేసుకుని 2013 పొంగల్ కానుకగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు కూడా. ప్రముఖ హాస్య నటుడు సంతానం కీలక పాత్ర పోషించిన మదగజరాజ సినిమాకు బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ సంగీతం అందించాడు. భారీ ఎత్తున విడుదల కావాల్సిన ఈ చిత్రం సంతానం తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదని కేసు వేయడంతో వాయిదా పడింది. దాదాపు 12 ఏళ్లుగా అలా ల్యాబ్ లో ఆగిపోయిన ఈ సినిమా ఈ ఏడాది పొంగల్ కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. చిత్ర హీరో విశాల్ తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు. పొంగల్ కు రావాల్సిన అజిత్ విదాముయార్చి వాయిదా పడడంతో డజనుకు పైగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తమిళ్ బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి.