
యంగ్ హీరో విశ్వక్ సేన్ తన సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నా, ఇటీవల విడుదలైన “లైలా” సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు పెంచినా, థియేటర్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. దర్శకుడు రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. అంతకు ముందు వచ్చిన “మెకానిక్ రాకీ” మిక్స్డ్ టాక్ అందుకోగా, “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన అభిమానులకు ఓ ప్రత్యేక లేఖ రాశారు, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విశ్వక్ సేన్ అభిమానులకు ఓ లేఖ
“నమస్తే.. ఇటీవల నా సినిమాలు అందరూ ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాపై వచ్చిన నిర్మాణాత్మక విమర్శలను పూర్తిగా అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణానికి మద్దతుగా నిలిచిన అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నాను. కొత్తదనం చూపించాలనే నా ప్రయత్నంలో, కొన్ని చోట్ల తప్పిదాలు జరిగినట్లు అంగీకరిస్తున్నాను. ఇకపై నా ప్రతి సినిమా క్లాస్ అయినా మాస్ అయినా అసభ్యత లేని మంచి కంటెంట్‌తో వస్తుంది. నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు మీకు పూర్తిగా ఉంది, ఎందుకంటే నా ప్రయాణంలో ఎప్పుడూ నాకు మద్దతుగా నిలిచింది మీరే.”
భవిష్యత్తులో విశ్వక్ సేన్ సినిమాలు
విశ్వక్ సేన్ తన కెరీర్‌లో ఇప్పటి వరకు “ఫలక్ నుమా దాస్”, “హిట్”, “అశోక వనంలో అర్జున కల్యాణం” లాంటి విజయవంతమైన చిత్రాలు అందించారు. కానీ, గత కొన్ని సినిమాలు నిరాశ పరచడంతో ఇకపై కథలను జాగ్రత్తగా ఎంపిక చేస్తానని, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయానికి తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. తనను నమ్మి మద్దతిచ్చిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, దర్శకులు, రచయితలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.