
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు క్రికెట్ మాత్రమే కాకుండా సినీ రంగంలో కూడా అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ ద్వారా భారతీయ ప్రేక్షకులతో సాన్నిహిత్యం పెంచుకున్న వార్నర్, ఇప్పుడు తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘రాబిన్ హుడ్’ చిత్రంలో అతని గెస్ట్ అప్పీరెన్స్ ఉంటుందని అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా, హీరో నితిన్ సరసన శ్రీలీల నటిస్తోంది. కాగా, డేవిడ్ వార్నర్ పాత్రకు సంబంధించిన షూటింగ్ రహస్యంగా పూర్తయిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమాచారం బయటకు రావడంతో, అతని పాత్ర ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. క్రికెట్‌ను ప్రేమించే తెలుగు ప్రేక్షకులకు, తమ అభిమాన ఆటగాడు సినిమాల్లో నటించడం ఓ ప్రత్యేక అనుభూతిగా మారనుంది.
ఇదిలా ఉండగా, 2025 IPL వేలంలో డేవిడ్ వార్నర్ ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. అతని బేస్ ప్రైస్ రూ. 2 కోట్లు కాగా, ఏదీ బిడ్ చేయలేదు. అలాగే, 2024 టీ20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత, అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, సినిమా రంగంలో కొత్త ప్రయాణం మొదలుపెట్టిన వార్నర్, టాలీవుడ్‌లో మరిన్ని అవకాశాలు దక్కించుకుంటాడా? అనేది వేచి చూడాలి.
‘రాబిన్ హుడ్’ మూవీ మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. డేవిడ్ వార్నర్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమా, క్రికెట్ అభిమానులు, సినీ ప్రేక్షకులందరినీ అలరించనుంది!