
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరొందిన రష్మిక మందన్న ఇటీవల తన వ్యాఖ్యలతో కన్నడ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఒక ఇంటర్వ్యూలో “నేను హైదరాబాద్ నుండి వచ్చాను” అని చెప్పిన విషయం పెద్ద వివాదంగా మారింది. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రవికుమార్ గౌడ స్పందిస్తూ, బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె హాజరు కాలేదని, కన్నడను తక్కువ చేసి మాట్లాడుతోందని ఆరోపించారు.
“గతంలో రష్మికను ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించాం. కానీ, ఆమె ‘కర్ణాటక ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాకు సమయం లేదు’ అని చెప్పింది. మా ఎమ్మెల్యేలు ఆమెను పిలిచినా స్పందించలేదు. ఆమె కన్నడ గురించి అహంకారంగా మాట్లాడుతోంది. మనం కొంత జ్ఞానం నేర్పించాలి!” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ఆరోపణలపై రష్మిక టీమ్ స్పందిస్తూ, ఆమెపై వచ్చిన విమర్శలు అవాస్తవమని స్పష్టం చేసింది. “బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆమె రావడానికి నిరాకరించిందన్నది నిజం కాదు. అలాగే, కన్నడ భాషను అగౌరవపరిచిందన్నది కూడా పూర్తిగా అబద్ధం.” అని తెలిపారు.
ఇంతకు ముందు కరావే రాష్ట్ర అధ్యక్షుడు టి.ఎ. నారాయణ గౌడ కూడా రష్మికపై విమర్శలు చేశారు. “మీరు చిన్నప్పటి నుంచి కన్నడ భూమిలో పెరిగారు. కానీ, సినీ కెరీర్‌లో ముందుకెళ్లాక, కన్నడను మర్చిపోతారా?” అని ప్రశ్నించారు. ఈ విమర్శలపై రష్మిక అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగా స్పందిస్తున్నారు, ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.