విడుదల తేదీ : నవంబర్ 22, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : సత్యదేవ్, డాలీ ధనంజయ, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, అమృత అయ్యంగార్
దర్శకుడు : ఈశ్వర్ కార్తీక్
స్క్రీన్ ప్లే : ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు : బాల సుందరం, S. N. రెడ్డి, దినేష్ సుందరం
సంగీత దర్శకుడు : రవి బస్రూర్
సినిమాటోగ్రఫీ : సత్య పొన్మార్
సంబంధిత లింక్స్: ట్రైలర్
సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘జీబ్రా’. ఈ సినిమాను దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ మనీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కన్నడ నటుడు డాలీ ధనంజయ కూడా మరో లీడ్ రోల్లో నటించాడు. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
సూర్య (సత్యదేవ్) ఒక బ్యాంక్ ఎంప్లాయ్. మరో బ్యాంక్ ఎంప్లాయ్ స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఐదేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నా ఇంట్లో చెప్పడానికి మాత్రం సూర్యకి దైర్యం సరిపోదు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య స్వాతి ఓ సమస్యలో ఇరుక్కుంటుంది. ఆమెను సేవ్ చేయడానికి సూర్య చేసిన ఓ పని కారణంగా అతిపెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. నాలుగు రోజుల్లో ఐదు కోట్లు ఆదికి (డాలీ ధనంజయ) ఇవ్వాల్సిన పరిస్థితి వస్తోంది. ఓ సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ అయిన సూర్య, అంత పెద్ద ఎమౌంట్ ను ఎలా తీసుకువచ్చాడు ?, ఆ ఐదు కోట్లు కోసం సూర్య ఏం చేశాడు ?, ఈ మధ్యలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ?, ఈ మొత్తం కథలో చివరకు జరిగిన కథ ఏమిటి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో మెయిన్ పాయింట్ బాగుంది. ఓపెనింగ్ నుంచి సూర్య (సత్యదేవ్) క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా సత్యదేవ్, అతని పాత్ర చుట్టూ నడిచే మనీ రిలేటెడ్ సన్నివేశాలు మరియు కొన్ని కామెడీ సీన్స్ సినిమాకి ప్లస్ అయ్యాయి. నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించే ట్రాక్, ఈ క్రమంలో పాత్రల మధ్య అనుకోకుండా జరిగే డ్రామా.. ఇక సత్యదేవ్ – డాలీ ధనంజయ పాత్రలను లింక్ చేస్తూ దర్శకుడు రాసుకున్న సీన్స్ బాగున్నాయి.
మొత్తమ్మీద ఈ ‘జీబ్రా’ సినిమాలో గుడ్ డ్రామాతో పాటు కొన్ని చోట్ల ఫన్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ప్రధాన పాత్రలో నటించిన సత్యదేవ్ తన పాత్రలో ఒదిగిపోయారు. సీరియస్ సిచ్యుయేషన్స్ లో కూడా తన టైమింగ్ తో ‘సూర్య’ పాత్రను సత్యదేవ్ చాలా బాగా పండించారు. మరో కీలక పాత్రలో కనిపించిన డాలీ ధనంజయ కూడా మెప్పించాడు. హీరోయిన్ గా ప్రియా భవానీ శంకర్ తన పాత్రకు న్యాయం చేసింది. బాబాగా సత్యరాజ్ ఆకట్టుకున్నారు.
కమెడియన్ సత్య డైలాగ్స్, ఆయన హావభావాలు బాగానే నవ్వు తెప్పించాయి. అమృత అయ్యంగార్ తో పాటు ఇతర కీలక పాత్రల్లో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఈశ్వర్ కార్తీక్ తీసుకున్న కథాంశం, మరియు సత్యదేవ్ – డాలీ ధనుంజయ పాత్రలు బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల స్లోగా సాగుతుంది. పైగా కీలక సన్నివేశాలు కూడా లాజికల్ గా కనెక్ట్ కావు. ముఖ్యంగా హీరో పాత్రతో పాటు విలన్ అండ్ హీరోయిన్ పాత్రలను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది. అలాగే, ఎవరికో పడాల్సిన డబ్బులు ఇంకెవరి ఖాతాలోనో పడితే..? ఈ కోణంలో నడిచే డ్రామా కూడా ఇంకా ఎఫెక్టివ్ గా రాసుకోవాల్సింది.
నిజానికి ఓ సాధారణ ఉద్యోగి కేవలం నాలుగు రోజుల్లో ఐదు కోట్లు సంపాదించాల్సిన పరిస్థితి వస్తే.. అతని మనస్తత్వం ఎలా ఉంటుంది ?, అతని ప్రవర్తన ఎలా మారిపోతుంది ? వంటి అంశాలను ఇంకా ఎఫెక్టివ్ గా చూపించి ఉండి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ఎంటర్ టైన్ గా మలచలేకపోయారు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ఈశ్వర్ కార్తీక్ దర్శకుడిగా ఆకట్టున్నా.. స్క్రీన్ ప్లే పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ అందించిన పాటలు పర్వాలేదు. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో పర్వాలేదు. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. సత్య పొన్మార్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలు బాల సుందరం, S. N. రెడ్డి, దినేష్ సుందరం నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
‘జీబ్రా’ అంటూ వచ్చిన ఈ మనీ క్రైమ్ థ్రిల్లర్ లో… మెయిన్ థీమ్, ప్రధాన పాత్రల మధ్య డ్రామా, కొన్ని ఫన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. అలాగే, సత్యదేవ్ తో పాటు మిగిలిన నటీనటుల నటన మరియు కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా సాగకపోవడం, సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో మనీ చుట్టూ తిరిగే క్రైమ్ అండ్ సస్పెన్స్ డ్రామా ఆకట్టుకున్నాయి.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team