Naga Vamsi: అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ రిలీజ్ తేదీ దగ్గరపడుతున్న వేళ, ఈ సినిమా విశేషాలతో పాటు ఇండస్ట్రీలో నడుస్తున్న థియేటర్ వివాదాలపై సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ సంచలన నిజాలను బయటపెట్టారు. తాజాగా ఆయన ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘లెనిన్’ ట్రైలర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో చాలామంది దీనిని ‘రంగస్థలం’ సినిమా టోన్‌తో పోల్చడంపై పాజిటివ్‌గా స్పందించారు. ఒక బ్లాక్‌బస్టర్ సినిమాతో పోల్చడం సంతోషమేనని, అయితే ఇది పూర్తిగా ఒక భిన్నమైన పల్లెటూరి నేపథ్య గ్రిప్పింగ్ డ్రామా అని స్పష్టం చేశారు. అఖిల్ యాక్టింగ్ గురించి చెబుతూ.. “ట్రైలర్ అనేది అఖిల్ యాక్టింగ్‌కి అస్సలు పారామీటర్ కాదు. థియేటర్లలో అఖిల్ పెర్ఫార్మెన్స్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారు” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా చివరి 40 నిమిషాలు అద్భుతమైన డ్రామాతో సాగుతుందని, అఖిల్ క్యారెక్టర్ చూసి ఆడియన్స్‌కు కన్నీళ్లు రావడం ఖాయం అని అన్నారు. ఈ సినిమాలో డ్రామా మహాభారత శైలిలో పీక్స్‌లో ఉంటుందని చెప్పారు. మొదటి 20 నిమిషాల తర్వాత క్లైమాక్స్ వరకు సినిమా ఎక్కడా బ్రేక్స్ లేకుండా దూసుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. తమన్ సెకండ్ హాఫ్ కోసం ఒక అదిరిపోయే మాస్ సాంగ్ ఇచ్చినా, సినిమా ఫ్లో దెబ్బతినకూడదని కింగ్ నాగార్జున గారి సలహా మేరకు ఆ పాటను పక్కన పెట్టినట్లు వెల్లడించారు.
పర్సంటేజ్ సిస్టమ్ వెనుక ఉన్న అసలు కుట్ర ఇదే..
ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న పర్సంటేజ్ సిస్టమ్ వర్సెస్ రెంటల్ విధానంపై నాగవంశీ షాకింగ్ కామెంట్స్ చేశారు. పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురావడం వెనుక డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను పూర్తిగా చంపేసే పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా సమయంలో నైజాంలోని 4, 5 థియేటర్లలో జరిగిన ఫ్రాడ్‌ను మేం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాం అని చెప్పారు. ఇలాంటి ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు పర్సంటేజ్ సిస్టమ్‌ను నిర్మాతలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. బుక్ మై షో ఫీజ్ మోసం ఆయన గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రేక్షకులు కట్టే కన్వీనియన్స్ ఫీజులో సగం థియేటర్ ఓనర్ జేబులోకి వెళ్తోంది. అందులో డిస్ట్రిబ్యూటర్ లేదా నిర్మాతకు కూడా కచ్చితంగా షేర్ ఇవ్వాలని అన్నారు. డిస్ట్రిబ్యూటర్ల మనుగడ గురించి చెబుతూ.. పర్సంటేజ్ సిస్టమ్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలకు అడ్వాన్స్‌లు ఇవ్వలేరు. అప్పుడు డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ అంతరించిపోయి, నిర్మాతలు కొద్దిమంది పెద్దల కాళ్ల దగ్గర మోకరిల్లి సినిమాలు రిలీజ్ చేసుకోవాల్సిన దుస్థితి వస్తుందని అన్నారు. అందుకే వన్‌సైడ్ అల్టిమేటమ్‌లు పాస్ చేస్తే నిర్మాతలు ఊరుకోరని నాగవంశీ తేల్చి చెప్పారు.
