Sun. May 31st, 2026
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!

Manchu Manoj: దిగ్గజ దర్శకుడు దాసరి నారాయణరావు సమాధి దుస్థితిపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోకు హీరో మంచు మనోజ్ వెంటనే స్పందించారు. సమాధి ప్రాంగణం నిర్లక్ష్యానికి గురై ఉండటాన్ని చూసి తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ విషయంపై స్పందించిన మనోజ్.. సమాధిని స్వయంగా శుభ్రం చేయిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే నేడు ఉదయం 7 గంటలకే తన టీమ్‌తో కలిసి అక్కడికి చేరుకుని పనులు ప్రారంభించారు.

తన సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందే ప్రత్యేకంగా సమయం కేటాయించిన మనోజ్.. సమాధి పరిసరాల్లో పేరుకుపోయిన ఎండుటాకులు, చెత్తాచెదారాన్ని స్వయంగా శుభ్రం చేశారు. ఆయనతో పాటు టీమ్ సభ్యులు కూడా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఓ యాంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో దాసరి సమాధి దయనీయ పరిస్థితి బయటపడింది. ఆ వీడియో చూసిన వెంటనే స్పందించిన మనోజ్.. తెలుగు సినీ పరిశ్రమకు అపార సేవలందించిన మహానుభావుడి సమాధి ఇలా ఉండటం బాధ కలిగించిందన్నారు.

మంచు మనోజ్, మౌనిక భూమా మంచు ఇటీవల ప్రారంభించిన “ఐక్య ధైర్య సేన” సమితి సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈ చర్య తక్షణ చర్య చేపట్టారు మనోజ్. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ప్రారంభించినట్లు ఇదివరకే వెల్లడించారు. హీరో మనోజ్ చేసిన ఈ పనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.