Mon. Jul 6th, 2026
NBK112: కొరటాల శివ ప్లాన్ మామూలుగా లేదుగా.. బాలయ్య కోసం 20 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్!

NBK112: ఒక స్టార్ హీరో, కమర్షియల్ దర్శకుడు చేతులు కలిపితే అభిమానుల అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ వంటి మాస్ కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లడంతో సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం తాత్కాలికంగా NBK112 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలక షూటింగ్ షెడ్యూల్‌పై ఆసక్తికర సమాచారం బయటకు రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. సమాచారం ప్రకారం ఆగస్టు రెండో వారంలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో ప్రధానంగా బాలకృష్ణపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ఈ యాక్షన్ సన్నివేశాల కోసమే దాదాపు 20 రోజుల పాటు నిరవధికంగా షూటింగ్ నిర్వహించేందుకు చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా హై వోల్టేజ్ యాక్షన్‌తో పాటు విజువల్‌గా కూడా షెడ్యూల్‌ ను గ్రాండ్‌గా తెరకెక్కించనున్నారని సమాచారం.

కొరటాల శివ సినిమాల ప్రత్యేకత గురించి చెప్పాలంటే, ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి చిత్రంలో ఒక బలమైన సోషల్ కాన్సెప్ట్ తోనే ముందుకు వస్తున్నారు. అదే ఫార్ములాను ఈ చిత్రంలో కూడా కొనసాగిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలకృష్ణ పూర్తిగా కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారనే ప్రచారం ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉండబోతోందట. ముఖ్యంగా ఆ ఫ్లాష్‌బ్యాక్‌లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంతో సాగుతుందని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతం ఊహాగానాలుగానే మిగిలాయి.

మరోవైపు మాస్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ మూవీ కథ ఉంటుందని సమాచారం. కొరటాల శివ గత చిత్రాల మాదిరిగానే ఈసారి కూడా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సెంటిమెంట్ కు కూడా పెద్దపీట వేసేలా కథను సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. ‘దేవర’ తర్వాత ఆయన తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, స్క్రిప్ట్ విషయంలో చాలా సమయం తీసుకుని పూర్తి స్థాయిలో కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బాలకృష్ణ మాస్ ఇమేజ్, కొరటాల శివ కథనం, గ్రాండ్ యాక్షన్ సీక్వెన్స్‌లు కలిసొస్తే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో భారీ విజయంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే కథ, పాత్రల నేపథ్యంపై వస్తున్న ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలంటే చిత్రబృందం నుంచి అధికారిక అప్‌డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.