Oscars 2027 Rule Adjustments: ప్రపంచ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్’ (అకాడమీ అవార్డ్స్) నియమావళిలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. 2027లో జరగబోయే 99వ ఆస్కార్ వేడుకల నుంచి ఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా భారతీయ సినిమాలకు, నటీనటులకు గొప్ప అవకాశంగా మారనున్నాయి. ఇంతకీ ఆ ప్రధాన మార్పులు ఏంటో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
ఆస్కార్ 2027లో వస్తున్న ఆ 3 ప్రధాన మార్పులు ఇవే..
1. యాక్టింగ్ కేటగిరీలో డబుల్ ధమాకా..
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. ఒక నటుడు లేదా నటి ఒక నిర్దిష్ట కేటగిరీలో (ఉదాహరణకు బెస్ట్ యాక్టర్) కేవలం ఒక సినిమాకు మాత్రమే నామినేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం.. ఒకే నటుడు ఒకే కేటగిరీలో రెండు వేర్వేరు సినిమాలకు కూడా నామినేషన్లు పొందవచ్చు. అంటే ఒక ఏడాదిలో ఒక నటుడు రెండు అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తే, ఆ రెండింటికీ ఓట్లు పడితే రెండూ ఆస్కార్‌కు నామినేట్ అవుతాయి.
2. AI ప్రదర్శనలకు నో ఎంట్రీ
సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో అకాడమీ కీలక నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై స్పష్టతనిచ్చింది. AI ద్వారా సృష్టించిన లేదా ఏఐ ప్రభావితమైన నటన, రచనలకు ఆస్కార్ అర్హత ఉండదు. అవార్డులు కేవలం మానవ మేధస్సుకు, సహజమైన ప్రతిభకు మాత్రమే దక్కాలని అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది.
3. భారత్‌కు కలిసొచ్చే ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ రూల్..
భారతదేశం వంటి దేశాలకు ఇది అతిపెద్ద శుభవార్త. గతంలో ఒక దేశం నుంచి ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరీకి కేవలం ఒక సినిమాను మాత్రమే అధికారికంగా పంపే వీలుండేది. ఇప్పుడు ఒక దేశం నుంచి అధికారిక కమిటీ ఒకటి కంటే ఎక్కువ సినిమాలను సబ్మిట్ చేయవచ్చు. దీనివల్ల భారతీయ సినిమాల మధ్య పోటీ తగ్గి, ఆస్కార్ రేసులో మన దేశం నుంచి ఎక్కువ సినిమాలు నిలిచే అవకాశం ఉంటుంది.
2027లో ఆస్కార్ ఎప్పుడంటే..
99వ అకాడమీ అవార్డుల వేడుక మార్చి 14, 2027న జరగనుంది. ఈ వేడుక నాటికి ఆస్కార్ తన ప్రయాణంలో శతాబ్ద కాలానికి (100 ఏళ్లు) చేరువవుతుంది. ఇటీవల జరిగిన ఆస్కార్స్‌లో ‘వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్’ (One Combat After Any other), ‘సిన్నర్స్’ (Sinners) వంటి చిత్రాలు ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నిబంధనలు కళాకారుల ప్రతిభకు మరింత గుర్తింపునివ్వడమే కాకుండా, గ్లోబల్ సినిమా మార్కెట్‌లో భారత్ వంటి దేశాలకు మరిన్ని అవకాశాలను కల్పిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
