Sat. May 9th, 2026
Golden Globes: 2027 అవార్డుల కోసం గోల్డెన్ గ్లోబ్స్ షాకింగ్ రూల్స్!

సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్స్ (Golden Globes) అవార్డుల నిర్వాహకులు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027లో జరగనున్న 84వ ఎడిషన్ వేడుకల కోసం కృత్రిమ మేధ (AI) వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఇటీవల ఆస్కార్ కమిటీ కూడా ఏఐపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్స్ కూడా అదే బాటలో నడుస్తూ మానవ సృజనాత్మకతను కాపాడే దిశగా అడుగులు వేసింది.

కొత్త నిబంధనల ప్రకారం.. సినిమాల్లో లేదా వెబ్ సిరీస్‌లలో ఏఐని ఉపయోగించినంత మాత్రాన ఆ చిత్రాన్ని అవార్డుల రేసు నుంచి తొలగించరు. కానీ, ఆ పనిలో మానవ సృజనాత్మకత, కళాత్మక నిర్ణయాలు ప్రధానంగా ఉండాలి. అంటే ఏఐ కేవలం సహాయకారిగా మాత్రమే ఉండాలి తప్ప, దానికి ప్రాధాన్యత ఉండకూడదు. ముఖ్యంగా ఏదైనా సన్నివేశంలో నటీనటుల వాయిస్‌ని లేదా రూపాన్ని (Likeness) ఏఐతో మార్చినట్లయితే, ఆ వివరాలను ఎంట్రీ సమయంలోనే తప్పనిసరిగా వెల్లడించాలి.

నటన (Appearing) విభాగంలో నిబంధనలు మరింత కఠినంగా ఉన్నాయి. పూర్తిగా ఏఐ ద్వారా సృష్టించిన నటనలకు అవార్డులు ఇచ్చే ప్రసక్తే లేదని నిర్వాహకులు తేల్చి చెప్పారు. నటుల అనుమతి లేకుండా వారి డిజిటల్ రూపాన్ని వాడితే అస్సలు అంగీకరించమని స్పష్టం చేశారు. కేవలం నటనకే కాకుండా దర్శకత్వం, రచన, సంగీతం, యానిమేషన్ విభాగాల్లో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10, 2027న ఈ అవార్డుల వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఈసారి కూడా ప్రముఖ కమెడియన్ నిక్కీ గ్లేజర్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు.