Sat. May 9th, 2026
Hero Krishna Sai: హీరో కృష్ణసాయి మంచి మనసు.. రెడ్ క్రాస్ సొసైటీకి రూ.4 లక్షల విరాళం!

టాలీవుడ్ యువ హీరో కృష్ణసాయి తన మంచి మనసును చాటుకున్నారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే ఆయన.. తాజాగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి తన వంతు మద్దతుగా రూ.4 లక్షల విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును అందించారు. కృష్ణసాయి చేస్తున్న సేవా కార్యక్రమాలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, ఆదర్శంగా నిలుస్తున్న కృష్ణసాయి చొరవను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా ఇరువురు పలు సామాజిక అంశాల గురించి చర్చించుకున్నారు.

తన పేరు మీద స్థాపించిన ‘కృష్ణసాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా కృష్ణసాయి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య ఖర్చుల నిమిత్తం అండగా నిలుస్తున్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు, అవసరార్థులకు నిత్యం భోజన సౌకర్యం సహా ఇతర నిత్యావసరాలను అందజేస్తున్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వారిలో చైతన్యం నింపేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఆయన చేస్తున్న పోరాటాన్ని తెలంగాణ గవర్నర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రశంసించారు.

హీరో కృష్ణసాయి ఒకవైపు సినీ రంగంలో రాణిస్తూనే.. మరోవైపు సమాజం పట్ల బాధ్యతగా మెలగడం విశేషం. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కృష్ణసాయి పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ.. సేవా కార్యక్రమాలకు సమయం కేటాయించడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నటుడిగానే కాకుండా మంచి మనసున్న సేవామూర్తిగా కృష్ణసాయి గుర్తింపు పొందుతున్నారు.