Sat. May 9th, 2026
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?

టాలీవుడ్ ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరుకుంటున్న తరుణంలో.. ఆ స్థాయిని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు సిద్ధమైంది **‘ది మానిటి.ఇన్’ (The Manity.in). వందల కోట్లు కాదు, ఏకంగా వేల కోట్ల బాక్సాఫీస్ వసూళ్లే లక్ష్యంగా, అత్యున్నత సాంకేతిక విలువలతో కూడిన విజువల్ వండర్‌గా ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని టీం ప్రకటించింది. వీఎఫ్ఎక్స్ (VFX) రంగంలో అనుభవం ఉన్న డైరెక్టర్ బీఎస్ రావు, భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ చూడని రీతిలో, అచ్చం హాలీవుడ్ మేకింగ్ స్టైల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. సాధారణంగా ఐమాక్స్ కెమెరాలను హాలీవుడ్ భారీ యాక్షన్ సినిమాలకు మాత్రమే ఎక్కువగా వినియోగిస్తుంటారు. దర్శకధీరుడు రాజమౌళి లాంటి వారే ఐమాక్స్ ఫార్మాట్‌ను వాడటానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే, తన మొదటి సినిమాతోనే టాలీవుడ్‌లో మొట్టమొదటిసారిగా ‘IMAX 8K’ ఫార్మాట్‌ను పరిచయం చేస్తూ బీఎస్ రావు సాహసం చేస్తున్నారని టీం ప్రకటించింది. టెక్నాలజీ పరంగా ఏమాత్రం రాజీ పడకుండా, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే సంకల్పంతో ప్రతి ఫ్రేమ్‌నూ ఓ విజువల్ పోయెట్రీలా తీర్చిదిద్దనున్నారని చెబుతున్నారు.

“మానవత్వం (Humanity) విఫలమైనప్పుడు ‘మానిటీ’ (MANITY) ఏం చేస్తుంది?” అనే విలక్షణమైన పాయింట్‌తో ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ సాగనుంది. సమాజంలో మానవ విలువలు పతనమైనప్పుడు ప్రకృతి లేదా ఒక అదృశ్య శక్తి ఎలా స్పందిస్తుందనే సోషల్ ఎలిమెంట్స్‌ను ఇందులో అద్భుతంగా చూపించబోతున్నారు. హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్‌ను మన తెలుగు హీరోలతోనే సాధ్యం చేసి చూపిస్తానని డైరెక్టర్ బీఎస్ రావు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఏ స్టార్ హీరోకైనా ఇట్టే సరిపోయేలా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను సిద్ధం చేశారు. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించినట్లు, డేట్స్ కుదిరితే ఈపాటికే సినిమా పట్టాలెక్కేదని ఆయన తెలిపారు.