Sandhya Theatre Stampede: హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కేసుకు సంబంధించి కమిటల్ బాండ్ ప్రక్రియ నేపథ్యంలో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. గత విచారణ సందర్భంగా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ వర్చువల్ విధానంలో కోర్టు ముందు హాజరయ్యారు. అయితే కేసులో ఉన్న ఇద్దరు నిందితులు కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణను నాంపల్లి కోర్టు నేటికి వాయిదా వేసింది.
ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉన్నారు. వారందరూ కోర్టుకు హాజరైన తర్వాతే తదుపరి విచారణ ప్రక్రియను కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో నేటి విచారణకు ప్రాధాన్యత ఏర్పడింది. అల్లు అర్జున్ కూడా ఈరోజు జరిగే విచారణకు ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్ విధానంలోనే హాజరయ్యే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. దీనికి కారణం ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబై లోనే ఉన్నారు.
