Chief Film OTT : ఒకప్పుడు వ్యాపార ప్రకటనలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ‘ది లెజెండ్’ శరవణన్… ఇప్పుడు సినిమాల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. తొలి సినిమా ‘ది లెజెండ్’తో భారీ ఎంట్రీ ఇచ్చిన ఆయన… ఇప్పుడు మరింత స్టైలిష్, మరింత యాక్షన్ ప్యాక్డ్ అవతార్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ‘లీడర్’ (Chief). స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ తమిళ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రావడంతో సోషల్ మీడియాలో మళ్లీ చర్చ మొదలైంది. సాధారణ మెకానిక్‌గా కనిపించే ఒక వ్యక్తి… అసలు అతని వెనుక దేశ రక్షణకు సంబంధించిన సీక్రెట్ మిషన్ దాగి ఉంటే? అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఆసక్తిని పెంచుతోంది.
ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
‘ఎదిర్ నీచల్’, ‘కొడి’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్టైల్ సంపాదించుకున్న ఆర్.ఎస్. దురై సెంథిల్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మొదటి సినిమాతో పోలిస్తే శరవణన్ నటనలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్, ఎమోషనల్ మూమెంట్స్‌లో ఆయన ఈసారి మరింత కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టాలీవుడ్ బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటించగా… ఆండ్రియా జెరేమియా, షామ్, సంతోష్ ప్రతాప్ కీలక పాత్రల్లో కనిపించారు. గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైప్ ఇస్తోంది. ముఖ్యంగా యాక్షన్ బ్లాక్స్‌ను హాలీవుడ్ స్టైల్‌లో ఎలివేట్ చేసే విధంగా సంగీతం పనిచేసిందని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. 2026 ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా… మే 28న (ఇవాళే) ప్రైమ్ వీడియోలో అఫీషియల్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రావడంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.
‘లీడర్’ కథ
తూత్తుకుడి పోర్ట్ ప్రాంతంలో కార్ మెకానిక్‌గా పనిచేసే శక్తివేల్ అలియాస్ పొన్మారన్ జీవితం చుట్టూ సినిమా తిరుగుతుంది. భార్య మీరా, తన చిన్న కూతురితో సాధారణ కుటుంబ జీవితం గడిపే అతను… బయటకు చూస్తే చాలా సాదాసీదా మనిషిలా కనిపిస్తాడు. కానీ అదే సమయంలో పోర్ట్‌కు చేరిన ఒక అనుమానాస్పద కంటైనర్ దేశ భద్రతకు ముప్పుగా మారుతుంది. అక్రమ రవాణా, అండర్‌గ్రౌండ్ నెట్‌వర్క్‌లు, దేశద్రోహ కార్యకలాపాల వెనుక ఉన్న పెద్ద కుట్రను వెలికితీయడానికి ఇన్‌స్పెక్టర్ ఇంద్రా సత్యమూర్తి దర్యాప్తు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో ఒక లోకల్ డాన్ కారణంగా శక్తివేల్ కూడా ఈ ప్రమాదకర ఆటలో చిక్కుకుంటాడు.
అక్కడి నుంచే సినిమా అసలు ట్విస్ట్ మొదలవుతుంది. అందరూ సాధారణ మెకానిక్ అనుకున్న శక్తివేల్‌కు అసలు స్పై బ్యాక్‌గ్రౌండ్ ఉందని బయటపడటం కథను మరో లెవల్‌కు తీసుకెళ్తుంది. గతంలో దేశ రక్షణ కోసం పనిచేసిన అతను… ఇప్పుడు మళ్లీ ఒక పెద్ద మిషన్‌లోకి దిగాల్సిన పరిస్థితి వస్తుంది. దేశాన్ని ప్రమాదంలోకి నెట్టే కుట్రను అడ్డుకునేందుకు డీసీపీ భక్తవత్సలం సహాయంతో అతను ఎలా పోరాడాడు? చివరకు ఎలా ఒక ‘లీడర్’గా నిలిచాడు? అన్నదే సినిమా మైన్ స్టోరీ.
