Thu. May 21st, 2026
Pakistan Restores Historic Hindu Names : పాకిస్తాన్ ‘హిందూ’ జపం.!

పాకిస్తాన్.. అంటేనే అది హిందూ వ్యతిరేక దేశం అని గుర్తొస్తుంది. 1947 విభజన తర్వాత భారతీయ మూలాలను సమూలంగా తుడిచేసి, ఇస్లాం మయం చేసేసింది పాకిస్తాన్. అయితే అదంతా గతం. ఇప్పుడు హిందూ పేర్లను తిరిగి పునరుద్ధరిస్తోంది పాకిస్తాన్ లోని ఓ రాష్ట్రం. ఇస్లాంపురా కృష్ణ నగర్‌గా మారుతోంది, ముస్తఫాబాద్ తన అసలు పేరైన ధర్మపురను తిరిగి గర్వంగా ప్రకటించుకుంటోంది. అసలు ఈ అకస్మిక మార్పు వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశమేంటి?

1947 విభజన కేవలం భూభాగాల విభజన మాత్రమే కాదు, అది వేల ఏళ్ల నాటి నాగరికతకు జరిగిన అమానుషమైన విధ్వంసం. పాకిస్థాన్ ప్రభుత్వం ఒక క్రమపద్ధతిలో ఆ ప్రాంతంలో ఉన్న హిందూ, సిక్కు మూలాలను చెరిపేసింది. వందలాది వీధులు, కూడళ్లు, పాఠశాలలు, ప్రభుత్వ భవనాల పేర్లను ఇస్లామీకరించింది. పాఠశాల పాఠ్యపుస్తకాల్లో పాకిస్థాన్ చరిత్రను కేవలం ఇస్లామిక్ కోణంలోనే బోధించడం మొదలుపెట్టారు. ప్రాచీన భారతదేశ చరిత్రను, హిందూ-సిక్కు పాలకుల కీర్తిని పాఠ్యాంశాల నుంచి క్రమంగా తొలగించారు.

పాకిస్తాన్ లో వేల ఏళ్ల నాటి ప్రాచీన హిందూ దేవాలయాలు నిర్వహణ లేక శిథిలావస్థకు చేరాయి. అనేక చోట్ల ఆలయ భూములను అక్రమంగా ఆక్రమించి ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మించారు. మరికొన్ని చోట్ల వందలాది ఆలయాలను మతతత్వ మూకలు కూల్చివేశాయి. గురు నానక్ పుట్టినగడ్డ సహా అనేక ముఖ్యమైన గురుద్వారాలు కాలక్రమేణా దెబ్బతిన్నాయి. సిక్కులు దేశం విడిచి వెళ్లడంతో, అటువంటి పవిత్ర స్థలాలు భద్రత లేక తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. పార్సీ కమ్యూనిటీ పాకిస్థాన్ వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషించింది. విభజన తర్వాత అది కనుమరుగైపోయింది. కరాచీ, లాహోర్ వంటి నగరాల్లో పార్సీలు నిర్మించిన క్లబ్బులు, విద్యాసంస్థలు, ఆస్పత్రుల పేర్లు కాలక్రమేణా మరుగున పడ్డాయి.

అయితే దశాబ్దాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజల మనసుల్లో మాత్రం ఆ పేర్లు, ప్రాంతాలు చెరిగిపోలేదు. వాడుకలో ఉన్న పేర్లనే అక్కడి ప్రజలు పిలుచుకుంటూ వచ్చారు. కానీ అధికారిక రికార్డుల్లో మాత్రం ఆ పేర్లు ఉండేవి కావు. ఇప్పుడు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రభుత్వం ఆ పేర్లను పునరుద్ధరించేందుకు నడుం బిగించింది.
పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రభుత్వం చేపట్టిన ‘లాహోర్ హెరిటేజ్ రివైవల్ ప్రాజెక్ట్’ కింద, దశాబ్దాలుగా మరుగున పడిపోయిన చారిత్రక చిహ్నాలకు ప్రాణం పోస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలోనే సుమారు 9 ప్రధాన ప్రాంతాల పేర్లను ప్రభుత్వం మార్చేసింది. ఈ మార్పుల్లో అత్యంత కీలకమైనది ఇస్లాంపురాను ‘కృష్ణ నగర్’గా మార్చడం. అలాగే, సున్నత్ నగర్ ఇకపై ‘సంత్ నగర్’గా, ముస్తఫాబాద్ ‘ధర్మపుర’గా తమ పూర్వపు వైభవాన్ని దక్కించుకున్నాయి. లక్ష్మీ చౌక్ పేరును రికార్డుల్లో ‘మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్’గా మార్చేశారు. కానీ ప్రజలు మాత్రం ‘లక్ష్మీ చౌక్’ అనే పిలుచుకునేవారు. ప్రజా ఆకాంక్షలను గౌరవిస్తూ, ఇప్పుడు దానిని అధికారికంగా లక్ష్మీ చౌక్‌గా మార్చేశారు. అలాగే, గతంలో జైన్ మందిర్ చౌక్ పేరును బాబ్రీ మసీదు చౌక్ అని మార్చారు. తాజాగా దాన్ని రద్దు చేసి, తిరిగి ‘జైన్ మందిర్ చౌక్’గా పునరుద్ధరించారు. కేవలం పేర్ల మార్పుకే పరిమితం కాకుండా, క్రీడా రంగంలోనూ చారిత్రక వాస్తవాలను వెలికితీస్తున్నారు. మింటో పార్క్, గ్రేటర్ ఇక్బాల్ పార్క్‌లో ఉన్న పురాతన క్రికెట్ గ్రౌండ్లు, కుస్తీ అఖారాలను ఆధునీకరించే పని మొదలైంది. భారత దిగ్గజ క్రికెటర్ లాలా అమర్‌నాథ్, స్టార్ రెజ్లర్ గామా పహిల్వాన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన విషయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పుడు అధికారికంగా గుర్తు చేసుకుంటోంది.

 

ఈ పేర్ల మార్పు నిర్ణయం పాకిస్థాన్ మొత్తానికి వర్తిస్తుందా అంటే.. కాదు.! ఇది కేవలం ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ కు మాత్రమే పరిమితం. పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం, ప్రావిన్షియల్ ప్రభుత్వాలకు కొన్ని పరిపాలనాపరమైన అధికారాలు ఉంటాయి. అందులో భాగంగానే పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్, స్థానిక ఐడెంటిటీని పునరుద్ధరించాలని భావించారు. అందులో భాగంగానే ఈ పేర్లు మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్ మాత్రమే ఈ నిర్ణయం తీసుకుందంటే, దానికి ప్రధాన కారణం ‘సాంస్కృతిక వారసత్వం’. పంజాబ్.. ముఖ్యంగా లాహోర్, విభజనకు ముందు హిందూ, సిక్కు, ముస్లిం సంస్కృతుల కలయికగా ఉండేది. ఈ ప్రాంతం మూలాలు సింధు నాగరికతతో ముడిపడి ఉన్నాయి. పంజాబ్ ప్రభుత్వం తన ఆర్థిక ప్రయోజనాల కోసం ‘టూరిజం’ను ఒక ప్రధాన అస్త్రంగా వాడుకుంటోంది. చారిత్రక పేర్లను తిరిగి తీసుకురావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు, హిందువులను పర్యాటకంగా ఆకట్టుకోవాలని భావిస్తోంది.

పాకిస్తాన్ జాతీయ ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, దేశంలోని మతపరమైన ఛాందసవాద శక్తుల నుంచి వచ్చే ఒత్తిడి. జాతీయ ప్రభుత్వం నేరుగా హిందూ పేర్లను ప్రోత్సహిస్తే అది ‘ఇస్లామిక్ ఐడెంటిటీ’కి వ్యతిరేకంగా భావించే ప్రమాదం ఉంది. రెండోది, రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని సాకుగా చూపి, వివాదాలకు దూరంగా ఉండటం. తద్వారా ఇస్లామాబాద్ తన రాజకీయ భద్రతను కాపాడుకుంటోంది.

అంతర్జాతీయ రాజకీయాల పరంగా చూస్తే, ఇది ఒక ‘గ్రేట్ పిఆర్ స్టంట్’. దీని వెనుక అనేక అంశాలు దాగి ఉన్నాయి. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశానికి అంతర్జాతీయ పెట్టుబడులు అవసరం. మతపరమైన ఉదారవాదాన్ని ప్రదర్శించడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు ఒక సానుకూల సంకేతాన్ని పంపాలని పాకిస్థాన్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇదే నిర్ణయం సింధ్ లేదా ఖైబర్ పఖ్తున్ఖ్వా వంటి ప్రాంతాల్లో అమలు చేయడం దాదాపు అసాధ్యం. అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు, తీవ్రవాద ప్రభావం వల్ల ఇలాంటి మార్పులు భారీ మతపరమైన అల్లర్లకు దారితీసే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కేవలం పంజాబ్‌కే పరిమితం కావడం వెనుక ‘ప్రాంతీయ రాజకీయ బలప్రదర్శన’ కూడా ఉంది. నవాజ్ షరీఫ్ కుటుంబం పంజాబ్‌లో తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్, నవాజ్ షరీఫ్ కుమార్తె. సంప్రదాయవాదానికి భిన్నంగా.. ఆధునిక, సాంస్కృతిక వారసత్వానికి ప్రాధాన్యతనిచ్చే నేతగా మర్యమ్ నవాజ్‌ను ప్రొజెక్ట్ చేస్తోంది.

పేర్ల మార్పు నిర్ణయంపై పాకిస్థాన్ లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. చరిత్రకారులు, మేధావులు ఈ మార్పును లాహోర్ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నంగా స్వాగతిస్తున్నారు. మత ఛాందసవాద శక్తులు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మతపరమైన గుర్తుల తొలగింపు.. తమ ఉనికికి ముప్పు అని భావిస్తున్న వర్గాల నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. అయినప్పటికీ, ప్రభుత్వం వెనక్కి తగ్గేలా లేదు. దీనిని కేవలం లాహోర్‌కు పరిమితం చేయకుండా, భవిష్యత్తులో సింధ్, ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రాంతాల్లో కూడా ఇటువంటి పేర్ల మార్పు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

చారిత్రక వాస్తవాలను అంగీకరించడం అంటే, విభజన తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేసి ఒక కొత్త చరిత్రను రాయడమే. 79 ఏళ్లుగా కప్పేసిన చరిత్రను బయటకు తీయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అది మానవీయ దృక్పథంతో కూడిన సానుకూల అడుగు. కాలం మారుతోంది, లాహోర్ గల్లీల్లో వినిపిస్తున్న ‘కృష్ణ’, ‘లక్ష్మి’ పేర్లు.. మళ్ళీ ఆ నగరం అసలు సంస్కృతిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి.