కోలీవుడ్ యంగ్ హీరో, విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ప్రతిభ ఉన్నప్పటికీ, వరుస ప్రాజెక్టులు ఒప్పుకోవడం, ఆ తర్వాత వాటిని మధ్యలోనే పక్కన పెట్టడం లేదా ప్రాధాన్యతలు మార్చుకోవడం వల్ల ఆయన కెరీర్ నిలకడగా సాగడం లేదనే విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆయనపై తమిళ ఫిల్మ్ ఛాంబర్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు కావడం కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ధ్రువ్ విక్రమ్ హీరోగా ఒక భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేశాయి. ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వం వహించాల్సి ఉంది. ప్రణాళిక ప్రకారం, ధ్రువ్ నటిస్తున్న 4వ చిత్రం (#DV4) ఈ బ్యానర్లోనే రూపుదిద్దుకోవాల్సి ఉంది.
ఈ సినిమా కోసం నిర్మాతలు ధ్రువ్‌కు రూ. 1 కోటి రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. అంతేకాకుండా, ప్రీ-ప్రొడక్షన్ పనుల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేశారు. షూటింగ్ ప్రారంభానికి అంతా సిద్ధమవుతున్న తరుణంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ పతాకంలో కరణ్ దర్శకత్వంలో ధ్రువ్ ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించి, దానికి క్లాప్ కొట్టారు. నిజానికి ఒప్పందాల ప్రకారం, రమేష్ వర్మతో చేసే సినిమానే ధ్రువ్ 4వ చిత్రం (#DV4) అవ్వాలి. మైత్రీ మూవీస్‌తో చేసే సినిమా 5వ చిత్రం (#DV5)గా ఉండాలి. అంటే నీలాద్రి ప్రొడక్షన్స్ సినిమా పూర్తయిన తర్వాతే మైత్రీ సినిమాను మొదలుపెట్టాల్సి ఉంది.
అయితే ధ్రువ్ మాత్రం మొదట మైత్రీ మూవీస్ చిత్రాన్నే చేస్తానని, అది పూర్తయిన తర్వాతే రమేష్ వర్మ సినిమాను టేకాఫ్ చేస్తానని చెప్పడంతో వివాదం మొదలైంది. దీనివల్ల తమపై వడ్డీల భారం పడుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. హీరో తమును సంప్రదించకుండా, ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరొక ప్రాజెక్ట్‌ను #DV4గా ప్రకటించడం తమను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నీలాద్రి ప్రొడక్షన్స్, పెన్ స్టూడియోస్ ప్రతినిధులు తమిళ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించారు. ధ్రువ్ విక్రమ్ కెరీర్లో ఇలాంటి వివాదాలు లేదా ప్రాజెక్టులు నిలిచిపోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ప్రముఖ దర్శకులు మురుగదాస్, మణిరత్నం వంటి దిగ్గజాలతో సినిమాలు అనుకుని, వివిధ కారణాల వల్ల అవి అర్థాంతరంగా ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి.
