Sat. Jul 25th, 2026
Prabhas Sreenu: “ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా”.. సినియర్ యాక్టర్‌తో రూమర్స్‌‌పై ప్రభాస్ శ్రీను రియాక్షన్

Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో సోషల్ మీడియాలో తనపై, సీనియర్ నటి తులసిపై వచ్చిన ప్రచారాల గురించి భావోద్వేగంగా స్పందించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలపై కథనాలు ప్రచారం చేయడం వల్ల కలిగే బాధను ఈ సందర్భంగా వివరించారు. ముఖ్యంగా తులసి వంటి సీనియర్ నటి పేరు తనతో ముడిపెట్టి వచ్చిన వార్తలు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వార్తలు చూసి చాలా బాధ వేసింది. నా కూతురితో బయటికి వెళ్లాలన్నా భయం వేసే పరిస్థితి వచ్చింది. తులసి గారు ఎంత సాంప్రదాయబద్ధమైన వ్యక్తో నాకు బాగా తెలుసు. ఆమె తన కుటుంబం, పిల్లలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. నా మంచి కోసం దేవుడిని ప్రార్థిస్తూ, దిష్టి తగలకూడదని చెప్పేంత ఆప్యాయత ఉన్న వ్యక్తి ఆమె” అని తెలిపారు.

తులసి గారితో తనకు ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదని, కలిసి సినిమాలు కూడా పెద్దగా చేయలేదని ప్రభాస్ శ్రీను స్పష్టం చేశారు. “మేము ఎప్పుడూ కలిసి వ్యక్తిగతంగా కనిపించిన సందర్భాలు కూడా లేవు. అలాంటి వ్యక్తి గురించి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం చాలా బాధ కలిగించింది. నాకు కంటే ఆమె వైపు నుంచి ఆలోచిస్తేనే ఎక్కువ గిల్టీగా అనిపించింది. రేపు ఆమెను ఎలా ఎదుర్కోవాలనే భావన కలిగింది” అని అన్నారు. మీడియా, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. “మీ వల్ల ప్రజలకు ఎన్నో మంచి విషయాలు చేరుతున్నాయి. కానీ ఒక వార్త ప్రచురించే ముందు అది ఎవరి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా ఆలోచించాలి. ఆధారాలు లేని ప్రచారాలు ఒక మంచి వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీస్తాయి” అని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు.