Sat. Jul 25th, 2026
Prabhas Srinu: ‘ప్రభాస్ శ్రీను’ పేరు వెనుక అసలు కథ ఇదే.. ఎవరు పెట్టారో చెప్పిన నటుడు!

Prabhas Sreenu: ప్రముఖ నటుడు ప్రభాస్ శ్రీను తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రభాస్ ఉదార స్వభావం, వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ఆయన.. తనకు ప్రభాస్ నుంచి లభించిన గొప్ప బహుమతి డబ్బు కాదని, ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చాలామంది ప్రభాస్ గురించి ఆయన ఎంత సహాయం చేస్తారు, ఎంత డబ్బు ఇస్తారు అని మాట్లాడుతుంటారు. కానీ నా దృష్టిలో ఆయన విలువ డబ్బుల్లో కొలవలేం. ఒక వ్యక్తికి జీవితంలో అత్యంత అవసరమైనది కాన్ఫిడెన్స్. ప్రభాస్ నాకు అదే ఇచ్చారు” అని తెలిపారు.

“సముద్రం దగ్గర బతికే వ్యక్తికి ఈత వచ్చి ఉంటే ఎలాంటి భయం ఉండదు. కానీ అదే నీరు వరదలా వస్తే ప్రాణాలు కూడా తీసేయగలదు. జీవితంలో కూడా అలాగే. మనకు ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలం. ప్రభాస్ నాకు ఇచ్చింది ఆ కాన్ఫిడెన్స్” అని చెప్పారు. ప్రభాస్‌కు డబ్బు, సంపదలపై పెద్దగా ఆసక్తి ఉండదని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. “ఆయనకు డబ్బు గురించి ఆలోచించే అలవాటు చాలా తక్కువ. ఎవరైనా మనిషిగా నచ్చితే, నిజాయితీగా ఉంటే, వారికి పూర్తిగా అండగా నిలుస్తారు. ఆయన దగ్గర ఫెయిత్, సిన్సియారిటీకి చాలా విలువ ఉంటుంది” అని పేర్కొన్నారు. తనకు ప్రభాస్ ప్రత్యేకంగా డబ్బులు ఇస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. “మనకు అవసరమైనవి అన్నీ ఇస్తారు. అడిగితే ఇంకా ఎక్కువ కూడా ఇస్తారు. కానీ జీవితంలో మనకంటూ కొన్ని విలువలు ఉండాలి. ప్రతి విషయం డబ్బుతో కొలవలేం. ప్రభాస్‌తో నా బంధం కూడా అలాంటిదే” అని స్పష్టం చేశారు. ప్రభాస్‌తో తన అనుబంధం ఆర్థిక లావాదేవీలపై ఆధారపడలేదని, అది నమ్మకం, గౌరవం, ఆత్మీయతతో కూడుకున్నదని ప్రభాస్ శ్రీను ఈ సందర్భంగా వెల్లడించారు.