Sun. Jul 26th, 2026
Chennai Love Story: ‘బేబీ’ని మించిన హిట్.. ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ అబ్బవరం, సాయి రాజేష్ ఎమోషనల్ కామెంట్స్

Chennai Love Tale: థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్‌లో దర్శకుడు సాయి రాజేష్, హీరో కిరణ్ అబ్బవరం సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బేబీ’ తర్వాత మరోసారి విజయాన్ని అందుకున్న చిత్రబృందం సినిమా కోసం పడిన కష్టం గురించి మాట్లాడింది. ఈ సక్సెస్ మీట్‌లో రైటర్ సాయి రాజేష్ మాట్లాడుతూ తాము కేవలం ఒక సినిమా విజయంతో నిలిచిపోయే వాళ్లు కాదని నిరూపించుకోవాలనే పట్టుదలతో ‘చెన్నై లవ్ స్టోరీ’ని తెరకెక్కించామని అన్నారు. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారని, వ్యక్తిగతంగా తనకు ‘బేబీ’ కంటే ఈ మూవీనే ఎక్కువగా నచ్చిందని చెప్పారు. నిర్మాతలు ధీరజ్ మొగిల్నేని, ఎస్‌కేఎన్ ఎంతో మంది పేరున్న హీరోయిన్లను పక్కనపెట్టి, తెలుగు అమ్మాయి గౌరీ ప్రియను ఎంపిక చేయడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

ఆమెకు కథ చెప్పగానే ఎలాంటి సందేహాలు లేకుండా అంగీకరించి ముందుకు వచ్చిందని వెల్లడించారు. సినిమాలో అనంత్ శ్రీరామ్ రాసిన పాటలన్నీ ప్రత్యేకంగా నిలిచాయని, ముఖ్యంగా ‘చిరునవ్వుతో’ పాట తన దృష్టిలో గొప్ప పాటగా నిలిచిపోతుందని దర్శకుడు కొనియాడారు. హీరో కిరణ్ అబ్బవరం ఉండటంతో సినిమా ప్రచారం గురించి తాను పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదని చెప్పారు. ఒక హీరోలా కాకుండా నిర్మాతలా బాధ్యత తీసుకుని సినిమా కోసం కష్టపడ్డారని, ఇప్పటికీ ఆయనకు ఇవ్వాల్సిన పారితోషికంలో కొంత బకాయి ఉందని సరదాగా వెల్లడించారు. కాల్‌షీట్లతో సంబంధం లేకుండా పగలు రాత్రి అనే తేడా లేకుండా షూటింగ్‌కు వచ్చి సహకరించారని ప్రశంసించారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ అనంత్ శ్రీరామ్ రాసిన ‘చిరునవ్వుతో’ పాట తన కెరీర్‌లో చిరస్థాయిగా గుర్తుండిపోయే పాటగా నిలుస్తుందని అన్నారు. సినిమాటోగ్రాఫర్ విశ్వాస్‌తో కలిసి చేసిన ప్రతి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని, ఈ చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోసారి కొనసాగిందని చెప్పారు. తనకంటే ముందే ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిగుణ్ ఈ పాత్రను అంగీకరించి సినిమా కోసం నిలబడటం గొప్ప విషయమన్నారు. ఇక హీరోయిన్ గౌరీ ప్రియ గురించి మాట్లాడుతూ, ఒక అబ్బాయిలా పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్‌లో పాల్గొని ఎంతో అంకితభావంతో పనిచేసిందని కిరణ్ ప్రశంసించారు. నిర్మాత ఎస్‌కేఎన్ చిన్నపిల్లాడిలా సినిమాపై ప్రేమతో పనిచేస్తారని, హిట్ సాధించాలనే తపనతో అవసరమైతే డబుల్ కాల్‌షీట్లు కూడా ఏర్పాటు చేస్తూ చిత్రబృందానికి అండగా నిలిచారని అన్నారు.

సాయి రాజేష్ కథ చెప్పిన మొదటి రోజే ఈ సినిమా తన కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని చెప్పారని, ఇప్పుడు అదే నిజమైందని కిరణ్ వెల్లడించారు. ప్రారంభంలో ఈ పాత్రను తాను న్యాయం చేయగలనా అనే భయం ఉన్నప్పటికీ, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లలో ఎమోషన్స్ కి గురవుతూ సినిమాను ఆదరిస్తుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ‘చెన్నై లవ్ స్టోరీ’ విజయంతో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేస్తూనే, మంచి కథ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకాన్ని మరోసారి వ్యక్తం చేసింది. హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ” సినిమాని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, ధీరజ్ మొగిల్నేని నిర్మించారు. సాయి రాజేష్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు.